ప్రభుత్వ దిష్టిబొమ్మతో శవయాత్ర

ప్రజాశక్తి-కడప అర్బన్‌ మున్సిపల్‌ కార్మికులు సమ్మెలో భాగంగా పదవ రోజు కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ప్రభుత్వ శవయత్రచేస్తూ తమ నిరసన తెలిపారు. గురువారం ఫెడరేషన్‌ నాయకులు శ్రీరామ్‌ అధ్యక్షతన శవయాత్ర చేపట్టారు. ముఖ్యఅతిథిగా వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్‌ హాజరయ్యారు. డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి ఓబులేసు తమ సంఘం తరపున మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమ్మె మొదలై 10 రోజుల అవుతున్న కార్మికులు ఎంతో ఓపికతో శాంతియుతంగా తమ నిరసనను తెలియ జేస్తున్నారని పేర్కొన్నారు. వారేమీ గొంతుమ్మే కోరికలు కోరడం లేదని చెప్పారు. సిఎం జగన్‌ మోహన్‌రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ తేడా అంటూ ఏమీ లేదని, చేసే పని ఒకటైనప్పుడు జీతం ఇచ్చే విషయంలో తేడాలు ఎందుకని, మా ప్రభుత్వం వస్తే అందరినీ రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా ఎదురుచూసి, పలు ఆందోళనలు, సమ్మెలు, చర్చలు జరిగాయని చెప్పారు. ఇచ్చిన హామీలను నిలుపుకోమని రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా ధర్నా, నిరవధిక సమ్మె చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండివైఖరి వీడి కార్మికుల న్యాయమైనడిమాండ్‌ లు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సుంకర రవి, కంచుపాటి తిరుపాల్‌, గోపి, కిరణ్‌, శ్రీధర్‌ బాబు, నాగరాజు, ఆదాం, వై.రమేష్‌, సి. కొండయ్య, దస్తగిరమ్మ, కొండమ్మ ధరణి వాటర్‌ సెక్షన్‌, ఎలక్ట్రిసిటీ, ఇంజినీరింగ్‌ కార్మికులు పాల్గొన్నారు. బద్వేలు : మున్సిపల్‌ కార్మికులకు జగనన్న ఇచ్చిన హామీలు అమలు చేయాలని పురపాలక సంఘ కార్యాలయం వద్ద మున్సిపల్‌ కార్మికులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. కార్మికుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే కె.విజయమ్మ, నాయకులు మహబూబ్‌ బాషా, కె.వి.సుబ్బారెడ్డి, శంకర్‌రెడ్డి, యానాదిరెడ్డి, ఎస్‌ఎం.బాష, వెంకటయ్య సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ సిఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమ్మె విరమణకు అవసరమైన చర్యలు చేపట్టి కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. మాట తప్పి మడమ తిప్పడం సిగ్గుచేటని, కార్మికులు చేస్తున్న సమ్మెను విచ్చిన్నం చేయుటకు చేపట్టిన చర్యలను మానుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని, నాయకులు జివి రమణారెడ్డి, ఆదిల్‌ యూనియన్‌ పట్టణ అధ్యక్షులు పులి శ్యాం ప్రవీణ్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు దియ్యాల హరి, ఉపాధ్యక్షులు దియ్యాల దేవమ్మ, గంటా శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి దియ్యాల నాగేంద్రబాబు, కార్యదర్శులు నాగరపు సత్యరాజు, బద్వేల్‌ ప్రవీణ్‌ కుమార్‌, నేలటూరు పాలయ్య, కోశాధికారి కాలువ శివకుమార్‌ కమిటీ సభ్యులు పద్మిశెట్టి రామయ్య, ఇండ్ల చంద్రశేఖర్‌, తేళ్ల కిరణ్‌ పాల్గొన్నారు. ప్రొద్దుటూరు : కార్మికుల సమ్మెకు కాంగ్రెస్‌ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి నజీర్‌ కార్మికుల ధర్నా శిబిరానికి వచ్చిన మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ సమ్మతమైన కార్మికుల సమస్యలను ప్రభుత్వం అంగీకరించి సమ్మెకు ముగింపు పలకాలని పేర్కొన్నారు. ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు విజయకుమార్‌, మున్సిపల్‌ కార్మిక సంఘ గౌరవాధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయకుండా మొండికేస్తున్న ప్రభుత్వం పేదలకిచ్చే సంక్షేమ పథకాలు మున్సిపాల్టీ తదితర కార్మికులకు రద్దు చేయడం శోచనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘ కార్యదర్శి సాల్మన్‌, అధ్యక్షులు చంటి, కోశాధికారి రాఘవ, సహాయ కార్యదర్శులు రవికుమార్‌, మోహన్‌, ఉపాధ్యక్షులు గుర్రమ్మ, రమాదేవి, ప్రమీలమ్మ, నీతమ్మ, అన్నపూర్ణ, మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు.

➡️