ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల్ని చేర్పించండి

Mar 29,2024 23:12

సమావేశంలో మాట్లాడుతున్న వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి-గుంటూరు :
ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించడానికి ప్రత్యేక డ్రైవ్‌ని ఉపాధ్యాయులు నిర్వహించాలని యుటిఎఫ్‌ పిలుపునిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు తెలిపారు. బ్రాడీపేటలోని యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు తరం నైతిక విలువల తో, మానవ సంబంధాలను అభివృద్ధి చేసుకోవా లన్నా, రాజ్యాంగ విలువలను పరిరక్షించుకో వాలన్నా, మానవత్వం విలువలు పరిమళించా లన్నా ప్రభుత్వ విద్యా రంగం అభివద్ధి కావాలని వివరించారు. విద్యారంగ సంస్కరణ పేరుతో ప్రభుత్వం తెచ్చిన విధానాలు, పర్యవేక్షణ పేరుతో ఉపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చి కించపరుస్తున్నా, వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించు కోవడం, తల్లిదండ్రులతో కలిసి ముందుకు నడవటం ఉపాధ్యాయుల కర్తవ్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులపై తల్లిదండ్రులు నమ్మకంగా ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్న విద్యార్థులకు సామర్థ్యం ఆధారిత బోధన చేయటం ప్రధాన పనిగా ఉండాలని కోరారు. ఏప్రిల్‌ 23తో పాఠశాల పనిదినాలు పూర్తికావస్తున్నాయని, ఈలోపే ప్రతి ఉపాధ్యాయుడు తమ ప్రాంతంలో బడిఈడు ఉన్న పిల్లలను గుర్తించి, బడిలో చేర్పించాలని కోరారు. తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్చాలని కోరారు. పాఠశాల విద్యా వ్యవస్థను అస్తవ్యస్థం చేసిన జీవో నెంబర్‌ 117ను సమీక్ష చేయాలని, దాని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షులు ఎఎన్‌.కుసుమకుమారి, రాష్ట్ర ప్రచురణల విభాగం చైర్మన్‌ హనుమంతరావు మాట్లాడుతూ పాత పెన్షన్‌ని (ఓపిఎస్‌) పునరుద్ధరించాలని జిపిఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పాత పెన్షన్‌ ఇచ్చే వారికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు రాబోయే ఎన్నికల్లో బలపరచాలని కోరారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి జరుగుతున్న స్పాట్‌ కేంద్రాల్లో ఉపాధ్యాయులకు కనీస సౌకర్యాలు కల్పించాలనిన్నారు. అలాగే గతంలో రెనిమినేషన్‌కు సంబంధించిన అమౌంట్‌ కొన్ని జిల్లాల్లో జమ కాలేదని, వెంటనే వాటిని జమ చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో యుటిఎఫ్‌ గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల ప్రధాన కార్యదర్శులు ఎం.కళాధర్‌, జి.విజయసారథి, ఎ.శ్రీనివాసరావు, బాపట్ల జిల్లా అధ్యక్షులు జె.వినరుకుమార్‌, గుంటూరు జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️