ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి

Dec 24,2023 21:14

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : సిఎం జగన్మోహన్‌రెడ్డి మొండి వైఖరి నశించాలని అంగన్వాడీ కార్యకర్తలు కొవ్వొత్తులతో ఆదివారం రాత్రి నిరసన తెలిపారు. పార్వతీపురంలో సిఐటియు ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శనలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. సిఎం జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, తెలంగాణ రాష్ట్రం కంటే అదనంగా జీతాలు ఇవ్వాలని, రాజకీయ జోక్యం ఉండరాడని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని, జీతాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, నాయకులు బంకురు సూరిబాబు, అంగన్వాడీ సెక్టార్‌ లీడర్లు, అంగన్వాడి కార్యకర్తలు, పాల్గొన్నారు..పార్వతీపురంరూరల్‌ : అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్‌ వద్ద జరుగుతున్న సమ్మె ఆదివారం 13వ రోజు విజయవంతంగా కొనసాగింది. ఆ సంఘం జిల్లా కార్యదర్శి గంట జ్యోతి, ప్రాజెక్టు నాయకులు మర్రాపు అలివేలు, గౌరి, సిఐటియు నాయుకులు బి.లక్ష్మి ఆధ్వర్యాన కలెక్టరేట్‌ ఎదుట నిరసనలో అంగన్వాడీలు ఒంటికాలుపై నిలబడి, కళ్లు మూసుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో పెద్దసంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.సీతంపేట : స్థానిక ఐటిడిఎ ఎదుట అంగన్వాడీల సమ్మె ఆదివారం కొనసాగింది. ఈ సందర్భంగా అంగన్వాడీలు కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఎం.కాంతారావు అంగన్వాడీ వర్కర్స్‌ హెల్పర్‌ యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు, ఎ.పార్వతి, ఎ.దర్శమి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.టిడిపి నాయకులు భూదేవి సంఘీభావంఅంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని టిడిపి నాయకులు పడాల భూదేవి డిమాండ్‌ చేశారు. 2019 ఎన్నికల ముందు వైసిపి ప్రభుత్వం జగన్మోహనరెడ్డి అంగన్వాడీ టీచర్ల జీతాలను తెలంగాణా కంటే రూ.వెయ్యి అదనంగా పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పడం అన్యాయన్నారు. తక్షమే అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.కొమరాడ : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 13వ రోజు కొమరాడ మండల కేంద్రంలో జరిగే సమ్మెలో మజ్జి గౌరమ్మ తల్లి ఫోటోకు పూలమాల వేస్తూ కొబ్బరికాయలతో పూజలు చేస్తూ మా కోరికలు తీర్చమని మోకాలితో మొక్కుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్రామ దేవత అసిరమ్మ రూపంలో ఊగుతూ తమ కోర్కెలు తీర్చమని నిరసనలో అంగన్వాడీ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ కొమరాడ ప్రాజెక్టు ఉపాధ్యక్షులు సిరికి అనురాధ, నాయకులు మంగ సుజాత, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, పలువురు అంగన్వాడీలు పాల్గొన్నారు.సీతానగరం: అంగన్‌వాడీల నిరవధిక సమ్మెను విరమింప చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలని సిఐటియు మండల నాయకులు గవర వెంకటరమణ కోరారు. ఈ మేరకు క్రిస్మస్‌ పర్వ దినాన్ని పురస్కరించుకొని సిఎం జగన్‌మోహన్‌రెడ్డి తాను నమ్మిన జీసస్‌ క్రీస్తు చూపిన శాంతి మార్గంలో అంగన్వాడీలు సమస్యలు పరిష్కరించే చూడాలని కోరారు. కార్యక్రమంలో సెక్టార్‌ నాయకులు పి.యశోద, మరిచర్ల సునీత, ఎస్‌.సుజాత, ఎస్‌.శ్రీదేవి, చింతాడ సుగుణ, సుక్క ఈశ్వరమ్మ తదితర అంగన్వాడీలు పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : మండలం కేంద్రంలో అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీలకు మద్దతుగా ప్రజానాట్యమండలి జిల్లా కన్వీనర్‌ కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీలు చేస్తున్న పోరాటానికి ప్రజాసంఘాలతో పాటు ప్రజానాట్యమండలి అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగుల సంఘం ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️