ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే.. ‘రెండో సొరంగం పూర్తి’ ఆలాపన

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌: వెలిగొండ ప్రాజెక్టు రెండో సొరంగం పూర్తయిందని, అపర భగీరథుడు ముఖ్యమంత్రి అని పాట పాడటం ప్రజలను మభ్యపెట్టేందుకేనని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దగ్గుపాటి సోమయ్య విమర్శించారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ మార్కాపురం పట్టణ కమిటీ సమావేశం నాయకులు పందీటి రూబేన్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దగ్గుపాటి సోమయ్య మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకొస్తే సంవత్సరంలోనే పూర్తిచేసి నీరు ఇస్తామని, 2022 సెప్టెంబర్‌కు పూర్తి చేస్తామని, 2023 అక్టోబర్‌కు పూర్తి చేసిన అనంతరమే ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తామని, 2023 డిసెంబర్‌కు పూర్తి చేస్తామని, 2024 ఫిబ్రవరిలో జాతికి అంకితం చేస్తామని అంటూ వైసిపి ప్రభుత్వం నాలుగు సంవత్సరాల నుంచి మాయమాటలు చెబుతూ, తేదీలు మారుస్తూ, ప్రజలను మభ్యపెడుతోందని ఎద్దేవా చేశారు. రెండో సొరంగం మాన్యువల్‌గా తవ్వడం మాత్రమే పూర్తయిందని, లైనింగ్‌ పనులు అట్లానే మిగిలిఉన్నాయని తెలిపారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి తవ్విన మూడు రంధ్రాలు పూడ్చాల్సి ఉందన్నారు. మొదటి సొరంగం అడుగు భాగాన మూడు అడుగుల మేర ఉన్న గ్రావెల్‌ను తొలగించవలసి పని ఉందని, నల్లమల్ల సాగర్లోకి నీరును తీసుకుని వెళ్లే ఫీడర్‌ కెనాల్‌ పనులు ఇంకా చాలా అసంపూర్తిగా ఉన్నాయని అన్నారు. ఇన్ని విధాలుగా ప్రాజెక్టు పనులు అసంపూర్తిగా ఉంటే, ప్రాజెక్టు పూర్తయింది అని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడం కాక ఏమవుతుందని వారు ప్రశ్నించారు. వెలిగొండ ముంపు గ్రామాల ప్రజలకు చెల్లించవలసిన ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పరిహారం వెంటనే చెల్లించి, పునరావాస కాలనీలను పూర్తిచేసి నిర్వాసితులందరినీ బయటకు తరలించినప్పుడు మాత్రమే వెలుగొండ పూర్తయిందని భావించవలసి ఉంటుందన్నారు. వెంటనే నిర్వాసితులందరికీ పరిహారం చెల్లించి, నిర్వాసిత గ్రామాలలోకి తరలించాలని, పెండింగ్‌ పనులు పూర్తి చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డీకేఎం రఫీ, సిపిఎం మార్కాపురం పట్టణ నాయకులు షేక్‌ నన్నేసా, జవ్వాజి రాజు, బలుసుపాటి కాశయ్య, దర్శి శారా, గుంటూరు కొండయ్య, ఎస్‌కె కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.

➡️