ప్రభుత్వ స్థలాల్లో రాజకీయ ప్రకటనలకు అనుమతి వద్దు

Mar 19,2024 23:51

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి
ప్రజాశక్తి-గుంటూరు :
జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ప్రాంగణాల్లోని వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లను, బ్యానర్లను అనుమతించవద్దని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్ట అమలుపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ రిటర్నింగ్‌ అధికారులతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం అదేశాల మేరకు రాజకీయపార్టీల ప్రచార పోస్టర్ల ప్రదర్శనకు ప్రస్తుతం హైవేలు, మెయిన్‌ రోడ్ల ప్రక్కనున్న హార్డింగ్‌లను సమాన ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలకు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రిటర్నింగ్‌ అధికారులు వారి పరిధిలోని మున్సిపల్‌ కమిషనర్లు, పంచాయతి అధికారులకు వీటిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున కొత్త అనుమతులు ఇవ్వద్దని సూచించారు. ప్రైవేటు భవనాలపై వాల్‌రైటింగ్స్‌ను అనుమతించవద్దని, బ్యానర్లు, జెండాలకు అనుమతి తీసుకున్న తరువాత మాత్రమే ప్రదర్శించేలా చర్యలు తీసుకోవా లన్నారు. సి విజల్‌, వార్త పత్రికల్లో వచ్చిన ఫిర్యాదును సకాలంలో పరిష్కరించాలని, తనిఖీలు నిర్వహించిన నిబంధనలు ఉల్లంఘిం చిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. సీజ్‌చేసిన వాటి వివరాలు ఎలక్ట్రానిక్‌ సీజర్‌ మేనేజ్మెంట్‌ సిస్టంలో నమోదు చేయాలని చెప్పారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా ఈవీఎంల ర్యాండమైజేషన్‌, పోలింగ్‌ సిబ్బందికి శిక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావే శంలో సమావేశంలో మంగళగిరి నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, జేసీ జి.రాజకుమారి, గుంటూరు తూర్పు నియోజకవర్గం ఆర్వో కీర్తీ చేకూరి, తెనాలి నియోజకవర్గం ఆర్‌ఓ ప్రఖార్‌ జైన్‌, డిఆర్‌ఒ పి.రోజా పాల్గొన్నారు.

➡️