ప్రమాదకర క్రిమినల్‌ చట్ట నిబంధనలపై పోరాడాలి

Jan 29,2024 00:23

సమావేశంలో మాట్లాడుతున్న నన్నపనేని శివాజి
ప్రజాశక్తి – మంగళగిరి :
ప్రమాదకర క్రిమినల్‌ చట్ట నిబంధనలపై ఆటో డ్రైవర్లు సంఘటితంగా ఉండి పోరాటం చేయాలని ఆలిండియా రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎఐఆర్‌టిడబ్ల్యూఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షులు నన్నపనేని శివాజి పిలుపునిచ్చారు. ఆదివారం మంగళగిరి సిఐటియు కార్యాలయంలో ఆటో డ్రైవర్‌ యూనియన్‌ విస్తృత సమావేశం టి.శ్రీరాములు అధ్యక్షతన జరిగింది. శివాజి మాట్లాడుతూ ప్రపంచంలో రోడ్డు నిర్మాణ నిబంధనలకు విరుద్ధంగా ఇండియాలో రోడ్డు నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా రోడ్డు నిర్మాణాలు చేస్తున్నారని విమర్శించారు. బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలు ఇంకా నా అంటూ ఇండియన్‌ పీనల్‌ కోడ్‌, ఎవిడెన్స్‌ యాక్ట్‌, క్రిమినల్‌ ప్రొసీజర్‌ స్థానంలో మూడు కొత్త చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఈ చట్టాలు ప్రకారం రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చని వివరించారు. అయితే కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన చట్టం వల్ల ఐదు సంవత్సరాలకు దాకా జైలు శిక్ష, జరిమానా విధించబోతున్నానన్నారు. కొత్త చట్టంలోని సెక్షన్‌ 106 రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా నాయకులు ఎస్‌ఎస్‌ చెంగయ్య మాట్లాడుతూ ఆటో కార్మికులు సంఘటనగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని, 16వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే నిరసన ప్రదర్శనలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆటో యూనియన్‌ నాయకులు షేక్‌ కాజా, ఎం.వి సుబ్బారావు, సిహెచ్‌ సుదర్శన్‌రావు, పి.రమేష్‌ పాల్గొన్నారు.

➡️