ప్రశాంత ఎన్నికల నిర్వహణకు సహకరించాలి : జెసి

ప్రజాశక్తి-పీలేరు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం ప్రతిపాదించిన నియమ, నిబంధనలను ప్రతి ఒక్కరూ గౌరవించి వాటిని అనుసరించి తీరాలని పీలేరు నియోజకవర్గం ఎన్నికల అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ తెలిపారు. గురువారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు అన్ని రాజకీయ పార్టీలు సమానమే అని, ఎన్నికలకు సంబంధించిన ఏ పని చేయాలన్నా అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని ఎవరు అతిక్రమించి ప్రవర్తించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారాలకు, కార్యాలయాల ఏర్పాటుకు, వాహనాల వినియోగానికి అనుమతుల కోసం సువిధ యాప్‌ అందుబాటులో ఉందని, రాజకీయ కార్యక్రమాలకు 48 గంటల ముందు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలని, వారికి 24 గంటల్లోగా అనుమతులు లభిస్తాయని చెప్పారు. కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ ఉల్లంఘించే వారిపై సి-విజల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలియజేశారు. ఫిర్యాదులు అందిన 100 నిమిషాల్లోగా వారిపై సత్వర చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అనంతరం ఆయన సి-విజిల్‌ యాప్‌ పని విధానాన్ని వివరించారు. సమావేశంలో ఇఆర్‌ఒ రామ, పీలేరు నియోజకవర్గ పరిధిలోని గుర్రంకొండ, కలకడ, వాల్మీకిపురం, కలికిరి, కెవి పల్లి, పీలేరు మండలాల తహశీల్దారులు శ్రీనాథ్‌, ప్రియదర్శిని, ఖతిజున్‌ కుఫ్రా, విజయ కుమారి, ప్రియదర్శిని, నయాజ్‌ అహ్మద్‌, మహబూబ్‌ బాష, వైసిపి, టిడిపి, జనసేన, సిపిఎం పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️