ప్రశాంత కోనసీమలో హింస రాజేశారు

Jan 20,2024 23:52
ప్రశాంతతకు నిలయమైన

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి, మండపేట

ప్రశాంతతకు నిలయమైన కోనసీమను వైసిపి నేతలు దాడులు, దౌర్జన్యాలు, అల్లర్లతో హింసకు కేంద్రంగా మార్చారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని మండపేటలో శనివారం నిర్వహించిన రా.. కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. అల్లర్లు జరిగి ఇక్కడ వారం రోజులు ఇంటర్నెట్‌ కట్‌ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో చూడాలని, రౌడీయిజంతో కోనసీమను మరో పులివెందులగా మారుద్దామనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ‘వైసిపి ఐదేళ్ల పాలనలో మహిళలు, రైతులు, రైతు కూలీలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు ఎవరైనా ఆనందంగా ఉన్నారా? ఏ కులం, మతం, ప్రాంతం వారు ఆనందంగా లేరు. దీనికి కారణం వైసిపి విధ్వంస పాలన. రా..కదలిరా అనేది నాకోసం కాదు. దగా పడ్డ ఆంధ్రప్రదేశ్‌ కోసం. ఈ పాలనలో ఆక్వా రైతు కుదేలయ్యాడు. ధాన్యం రైతు దగా పడ్డాడు. కానీ గంజాయి పండించిన రైతులు బాగున్నారు. మండపేటలో సైతం గంజాయి అమ్ముతున్నారు. బాధ్యత లేని ముఖ్యమంత్రి పాలనలో ప్రతిరోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. ధాన్యం కొనే నాధుడు లేదన్నారు. సాగునీరు రాక వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందన్నారు. పోలవరం పూర్తయితే గోదావరి జిల్లాలో మూడు పంటలకు నీరు వచ్చేదన్నారు. నష్టాల్లోఉన్న ఆక్వా రంగాన్ని ఆదుకుని వారికి యూనిట్‌ రూ.1.50కే అందిస్తామన్నారు. అన్న క్యాంటీన్‌ మూసివేసి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, సబ్‌ ప్లాన్‌, సంక్రాంతి, క్రిస్మస్‌ కానుకలు రంజాన్‌ తోఫా తదితర 100 సంక్షేమ పథకాలకు కోత పెట్టారన్నారు. విద్యుత్‌, బస్‌ ఛార్జీలు, అన్నిరకాల పన్నులు పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. నాసిరకం మద్యం అమ్మకాలు పెంచి రాష్ట్రంలో 35 లక్షల మంది అనారోగ్యం పాలు కావడమే కాకుండా 35 వేలమంది మృత్యువాత పడ్డారన్నారు. ఆర్థికంగా సామాజి కంగా బిసిలను అభివృద్ధిలోకి తీసుకు వచ్చి వారి రుణం తీర్చుకుంటామన్నారు. టిడిపి హయాంలో ఇసుక ఉచితంగా అందిస్తే ఇసుక ధరలు విపరీతంగా పెంచేసి సామాన్యులకు అందకుండా చేశారన్నారు బాట ఛార్జీంటూ పేదవారిని దోచుకుంటున్నారన్నారు. ఇసుక దొంగలను వదిలేది లేదని, వారు దోచుకున్నదంతా కక్కిస్తామని హెచ్చరించారు. ఇసుక అందుబాటులో లేక 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక వలసలు పోతున్నారన్నారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు పెట్టి రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. ముఖ్యమంత్రి చేసిన నేరాలకు ఎంఎల్‌ఎలు, మంత్రులను బలిపశువులను చేసి బదీలీ చేస్తున్నారన్నారు. అంటరానితనం నిర్మూలనకు జస్టిస్‌ పున్నయ్య కమిటీ వేసి 12 జిఒలతో దళితులకు న్యాయం చేసిన పార్టీ తెలుగు దేశం అన్నారు. దళితుల 27 సంక్షేమ పథకాలు రద్దు చేసి రూ.27 వేల కోట్లు ఖర్చు చేయలేదన్నారు. వైసిపి పాలనలో 187 మంది దళితులు హత్యకు గురయ్యారన్నారు. దళిత డ్రైవర్‌ను చంపి డోర్‌ డెలివరీ చేసిన ఎంఎల్‌సిని ఊరేగిస్తున్నారన్నారు. ఇన్ని చేస్తూ మరొపక్క అంబేద్కర్‌ విగ్రహం పెట్టి ఇదే సామాజిక న్యాయం అంటూ గొప్పలు చెబుతున్నారన్నారు. అంబేద్కర్‌ చెప్పినట్లు రాజ్యాంగం గొప్పదైనా అమలు చేసే పాలకులు అసమర్థులైతే అరాచకం రాజ్యమేలుతుందన్నారు. యథా రాజా తథా ప్రజ అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆయన ఎంఎల్‌ఎలు, నాయకులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. మండపేట వైసిపి ఇన్‌ఛార్జి చాలా తెలివైనవాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘ఇసుకలో రూ.500 కోట్లు కొట్టేశారు. తాతపూడి ర్యాంపులో మండపేట మున్సిపాలిటీలో ఇళ్ల పట్టాల పేరుతో రూ.20 లక్షలు కూడా విలువ చేయని భూముల్ని రూ.50 లక్షలకు కొట్టేశారు. రౌడీయిజం చేస్తున్నారు. కాలేరు గ్రామంలో ఐదుగురు దళిత యువకులపై రౌడీ షీట్‌ ఓపెన్‌ చేయించారు. ఇద్దరు సర్పంచ్‌లపై కేసులు పెట్టారు. రేపు మీ గతి ఇదే. రామచంద్రాపురంలో చెల్లని కాసు చెల్లుబోయిన.. వేణు. విజయసాయిరెడ్డి కాళ్ల మీద పడి బిసిల ఆత్మగౌరవం తాకట్టు పెట్టారు. ముమ్మిడివరంలో పొన్నాడ సతీష్‌ రూ.15 లక్షల విలువైన భూమి రూ.30 లక్షలకు అమ్ముకున్నారు. లేఅవుట్‌ వేయాలంటే ఆయనకు కమీషన్లు ఇవ్వాలి. యానాం నుంచి అక్రమ మద్యం తెచ్చి అమ్ముతున్నారు. అమలాపురంలో పినిపే విశ్యరూప్‌ అవినీతికి అడ్డూ అదుపూ లేదు.’ అని చెప్పారు. టిడిపి అధికారంలోకి రాగానే ముమ్మడివరంలో గోదావరి నదిపై వంతెన నిర్మిస్తామని, బాలయోగి చిరకాల వాంఛ కోనసీమ రైల్వే లైన్‌ను పూర్తి చేస్తామని, ముక్తేశ్వరం-కోటిపల్లి మధ్య, సఖినేటిపల్లి-నర్సాపురం మధ్య వంతెన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కొబ్బరి దింపు, ఒలుపు కార్మికులకు బీమా పథకాన్ని ఏర్పాటు చేస్తామని, నష్టపోయిన కల్లు గీత, మత్స్యకారులు, చేనేత కార్మికులకు ఏ విధంగా న్యాయం చేయాలో చేసి చూపిస్తామని చెప్పారు. వైసిపి ఎంఎల్‌ఎ జగ్గిరెడ్డికి ప్రతి పనికీ కప్పం కట్టాలంట..కానీ ఆయన్ని మాత్రం జగన్‌ మార్చలేదు. అనపర్తి ఎంఎల్‌ఎను మార్చలేదు. హోల్‌సేల్‌ కరప్షన్‌ కింగ్‌ ద్వారంపూడిని మార్చలేదు. వైసిపి ఎంఎల్‌ఎల అవినీతిపై ఆధారాలు ఇస్తాం.. కేసులు పెట్టే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అని ప్రశ్నించారు. జగన్‌ సహా వైసిపి ఎంఎల్‌ఎల అవినీతిపై ఛార్జిషీట్లు వేస్తాం. దళిత మంత్రుల్ని మార్చారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసిలను నాయకులుగా ఎదగకుండా జగన్‌ రెడ్డి అడ్డుకుంటున్నాడని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి స్వర్ణ యుగం రావాలంటే ప్రజలంతా టిడిపి, జనసేన పార్టీలను గెలిపించాని పిలుపు ఇచ్చారు. అందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. అందరి రుణం తీర్చుకుంటానని చంద్రబాబు నాయుడు అన్నారు.

➡️