ప్రశ్నించేనా

జిల్లాలో ఒకవైపు కరువు, మరోవైపు వరద వంటి విచిత్ర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించడం ఆసక్తిని కలిగిస్తోంది. ఖరీఫ్‌, రబీ సీజన్‌ల్లో వర్షాభావ పరిస్థితులు నెల కొనడంతో వ్యవసాయ రంగం కుదేలైంది. ఇటువంటి పరిస్థితులు నెలకొనడంతో జిల్లా ప్రగతి ప్రశ్నార్థకంగా మారింది. కడప నగర రహదారుల విస్తరణ దగ్గర నుంచి రిమ్స్‌ సూపర్‌స్పెషాలిటీ భవన నిర్మాణ పనులు, ఆర్కిటెక్షర్‌ యూనివర్శిటీ నిర్మాణ పనులు, ఉక్కు పరిశ్రమ పనుల్లో పురోగతి, కొప్పర్తి పైప్‌లైన్‌ పనుల నత్తనడకన సాగుతున్న తీరుపై ప్రశ్నించే నాధుడే కరువయ్యాడు.. ప్రతిపక్ష టిడిపి నుంచి పాలకపక్ష తప్పిదాలను నిలదీసే అవకాశాలు సన్నగిల్లిన నేపథ్యంలో సమగ్ర చర్చ దేవతావస్త్రంలా మారింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో శనివారం జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో కథనం..ప్రజాశక్తి – కడప ప్రతినిధికడప, అన్నమయ్య జిల్లాల్లో కరువు కరాళ నృత్యం చేస్తోంది. పదేళ్లలో ఎన్నడూ లేని రీతిలో క్షామపీడిత పరిస్థితులు నెలకొన్నాయి. మిచౌంగ్‌ తుపాన్‌ కారణంగా జిల్లాలో 20 వేల ఎకరాల్లో పంట నేలపాలు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒక వైపు కరువు, మరోవైపు వరద పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో వ్యవసాయ రంగం అథ:పాతాళానికి చేరువైంది. ఇటువంటి పరిస్థితుల్లో కరువు, వరద పరిస్థితుల నుంచి రైతులను ఆదుకోవాలని కోరుతూ తీర్మానాలు చేయాల్సిన అవసరం ఉరుముతోంది. కడప నగరంలో రహ దారుల విస్తరణ ఏళ్ల తరబడి సా…గుతుంతోంది. కడప నగరంలోని ముంపు ప్రాంతాల పరిరక్షణకు ప్రకటించిన స్ట్రోమ్‌ డ్రెయిన్‌ పనుల్ని నిధుల కొరత వేధిస్తోంది. ఖరీఫ్‌లో నాలుగింట ఒక వంతు మాత్రమే సాగైన సంగతి తెలిసిందే. ఖరీప్‌ సాగుకు పోటీగా రబీ సీజన్‌ సాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రబీ సాగుపై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉంది. అన్నమయ్య, గండికోట నిర్వాసితుల మొర, పింఛా, ఎల్‌ఎస్‌పి గేట్ల మరమ్మతులు, సర్వరాయసాగర్‌, బ్రహ్మసాగర్‌, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పరిధిలోని లింగాల కాల్వ లీకేజీ, యురేనియం పైప్‌లైన్‌ పనుల పురోగతిపై ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంది. 2021 నవంబర్‌ వరదల్లో అన్నమయ్య రిజర్వాయర్‌ మట్టి కట్ట తెగిన సందర్భంగా సుమారు ఆరు గ్రామాల ప్రజానీకం నిర్వాసితులుగా మారిన సంగతి తెలిసిందే. అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్వాసితులను ఆదుకుంటామని హామీ నిచ్చారు. ఇప్పటికీ హామీలో ఆశించిన పురోగతి కనిపించ లేదు. పింఛా, ఎల్‌ఎస్‌పి గేట్లకు మరమ్మతులు, సర్వరాయసాగర్‌, బ్రహ్మసాగర్‌ లీకేజీల పరిష్కారం, యర్రబల్లి-పార్నపల్లి పైప్‌లైన్‌ పనుల్లో ఆలస్యం కారణంగా యురేనియం నిర్వాసిత గ్రామాలకు తాగునీటి సమస్య ఎప్పటికి పరిష్కారమవుతుందో తెలియడం లేదు. గండికోట నిర్వాసితులకు రూ. ఏడు లక్షల పరిహారానికి అదనంగా మరో రూ.మూడు లక్షలను అందిస్తామని ఇచ్చిన హామీని నిలుపుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా జీవనాడిగా మారిన ఉక్కు పరిశ్రమ ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేయడం సరే, పనుల్లో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. 2019 సార్వత్రిక ఎన్నికల ముంగిట తాము అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ మూడు అడుగు ముందుకు ఆరుఅడుగులు వెనక్కి చందంగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలో జెఎస్‌డబ్ల్యూ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు పనులను ప్రారంభించారు. ఇప్పటివరకు ఆశించిన పురోగతి కనిపించక పోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. కొప్పర్తికి రూ.150 కోట్ల నీటి సరఫరా పైప్‌లైన్‌ ఏర్పాటు ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందో తెలియడం లేదు. ఫలితంగా జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వలసలు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికైనా జిల్లా పరిషత్‌ పాలక వర్గం జిల్లా సమగ్రాభివృద్ధి అర్థ వంతమైన చర్చ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడంలో సందేహం లేదు.

➡️