ప్రాతినిధ్యం దక్కని అణగారిన వర్గాలు

Feb 29,2024 23:22

ప్రజాశక్తి – నరసరావుపేట : దశాబ్ధాలు గడిచిపోతున్నా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో అణగారిన సామాజిక తరగతులకు ఎన్నికల్లో ప్రాతినిధ్యం దక్కడం లేదు. సంఖ్యాపరంగా ప్రభావశీలురుగా ఉన్న సామాజిక తరగతులకు ప్రధాన రాజకీయ పార్టీలు టిక్కెట్‌ కేటాయింపులోనే చిన్న చూపు చూస్తున్నాయి. దీంతో తొలి (1952) నుండి రెండు సామాజిక తరగతుల వారి మధ్యే ఇక్కడ పదవి కేంద్రీకృతమైంది.నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 2.38 లక్షల మంది ఓటర్లుంటాయి. వీరిలో ఎస్సీ ఎస్టీలు 35 వేల మంది, బీసీలు 50 వేల మంది, ముస్లిమ్‌ మైనార్టీలు 34 వేల మంది ఉంటారు. మిగతావారు ఓసీలు కాగా వీరిలో కమ్మ, రెడ్డి సామాజిక తరగతులకు చెందిన వారు చెరి 30 వేల వరకూ ఉంటారని అంచనా. ఈ రెండు సామాజిక తరగతుల వారే ఇప్పటి వరకూ ఇక్కడి నుండి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. వైశ్య సామాజిక తరగతి చెందిన వారు ఒకరు కొన్ని దశాబ్ధాల కిందట నాలుగుసార్లు పోటీ చేయగా, గత ఎన్నికల్లో బీసీ సామాజిక తరగతికి చెందిన అభ్యర్థి పోటీ చేశారు. అయితే వీరిద్దరూ ఓడిపోయారు. అంతే మినహా ఇతర సామాజిక తరగతులకు పోటీ చేసే అవకాశమే దక్కలేదు.రానున్న ఎన్నికల్లోనూ గత సాంప్రదాయమే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార వైసిపి నుండి ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మూడోసారి పోటీలో నిలవనుండగా కమ్మ సామాజిక తరగతికి చెందిన అభ్యర్థిని పోటీలో పెట్టేందుకు ఓటర్ల అభిప్రాయాలను ఫోన్‌ల ద్వారా టిడిపి సేకరిస్తోంది. దీంతో ప్రతిపక్ష టిడిపి నుండి గతంలో పోటీ చేసిన అభ్యర్థికే మళ్లీ అవకాశం వస్తుందా లేదా? అనేది అస్పష్టంత నెలకొంది. మరోవైపు కమ్మ సామాజిక తరగతికి చెందిన మరో ఇద్దరు టిడిపి తరుపున టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇతర సామాజిక తరగతుల వారికి అవకాశం దాదాపు లేనట్లే నిర్థారణవుతోంది. ఇదంతా ఒకెత్తయితే మహిళా అభ్యర్థుల ఊసే ఇంత వరకూ ఏ ఎన్నికల్లోనూ రాకపోవడం గమనార్హం.

➡️