బకాయిలు చెల్లించకుంటే మూల్యం తప్పదు

Feb 2,2024 00:00

గుంటూరు దీక్షల్లో మాట్లాడుతున్న సీనియర్‌ నాయకులు వినోద
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీతం నుండి పొదుపు చేసుకొని దాచుకున్న డబ్బును తిరిగి చెల్లించకుండా మొండిగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని యుటిఫ్‌ నాయకులు హెచ్చరించారు. యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట, పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని గాంధీ పార్కు వద్ద ధర్నాచౌక్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండోరోజైన గురువారం కొనసాగాయి. గుంటూరులో దీక్షలను యుటిఎఫ్‌ నాయకులు టి.వినోద, కె.భావన్నారాయణ ప్రారంభించి మాట్లాడారు. ఉపాధ్యాయుల పట్ల ఇంత కక్షపూరితంగా వ్యవహరించిన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ఆదిలక్ష్మి, ఎం.కళాధర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ వరాల కోసం పోరాటం చేయట్లేదని, మేము దాచుకున్న డబ్బు మాకు ఇవ్వమని అడుగుతున్నామని చెప్పారు. 20వేల కోట్లు బకాయిలు చెల్లించకుండా ఈ ప్రభుత్వం ఉద్యోగులను ఆవేదనకు గురి చేస్తుందన్నారు. క్యాబినెట్‌ సమావేశంలో ప్రభుత్వం డిఎ, ఐఆర్‌ ప్రకటిస్తుందని భావించామని, కానీ ప్రభుత్వం మొండి చేయి చూపించిందన్నారు. ప్రభుత్వానికి రిటర్న్‌ గిఫ్ట్‌ తప్పకుండా ఉంటుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి బకాయిలు చెల్లించాలని, ఐఆర్‌, డిఎ ప్రకటించి ఉద్యోగుల అభిమానం పొందాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, ఏఎల్‌.శివపార్వతి, కోశాధికారి ఎండి.దౌలా, ఆదినారాయణ, కె.సాంబశివరావు, జి.వెంకటేశ్వరరావు, యు.రాజశేఖర్‌రావు, కేదార్‌నాధ్‌, జి.వి.ధనలక్ష్మి, కె.ప్రేమ్‌కుమార్‌, ఎస్‌.బసవేశ్వరరావు పాల్గొన్నారు.

నరసరావుపేటలో దీక్షలకు సంఘీభావంగా మాట్లాడుతున్న వి.కృష్ణయ్య

నరసరావుపేటలో రెండో రోజు దీక్షలను ఎన్జీవో నాయకుల రామకృష్ణ, ఆనంద్‌ ప్రారంభించారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య సంఘీభావం తెలిపి మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఉందని, బడ్జెట్లో కేటాయించిన నిధులను ఇతర పథకాలకు మళ్లించి రాష్ట్ర అభివృద్ధిని కూడా మరిచారని విమర్శించారు. గత 70 ఏళ్ల కాలంతో పోలిస్తే రూ .50 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని, మోడీ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో రూ.1.10 లక్షల కోట్లు అప్పులు చేశారని, అప్పులు చేసిన డబ్బులు మొత్తం ఎవరి జేబులోకి వెళ్లాయో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఉద్యోగ ఉపాధ్యాయులు బకాయిలు చెల్లించాలని కోరితే డబ్బులు లేవంటూ చెబుతున్నారని సమ్మెలను అణిచివేసేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. మోడీ అధికారంలోకి వచ్చే ముందు విదేశాల్లో ఉన్న రూ 70 లక్షల కోట్లను వెనక్కు తెచ్చి పేదలకు పంచుతాని చెప్పిన డబ్బులు ఏమయ్యాయన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి రూ 10.5 లక్షల కోట్ల అప్పులు చేశారని, ఈ డబ్బులు కూడా ఏమయ్యాయో అర్థం కాని పరిస్థితి నెలకొందని అన్నారు. పిల్లలకు శ్రద్ధతో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు తమ సమస్యల గురించి మానసిక వేదనతో గురవుతున్నారన్నారు. సరైన ఆదాయం సరైన పెన్షన్‌ పరిస్థితి లేకపోతే రానున్న రోజుల్లో ఉద్యోగ ఉపాధ్యాయుల పరిస్థితి దారుణంగా ఉంటుందని, ఉద్యోగ ఉపాధ్యాయులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్షులు పి.ప్రేమ్‌ కుమార్‌ మాట్లాడుతూ బకాయిలు చెల్లించాలని ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించినా ప్రభుత్వ స్పందించలేదన్నారు. ఉపాధ్యాయులు తాము దాచుకున్న డబ్బులు కోసం కూడా పోరాటాలు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. బకాయిలు మొత్తం విడుదల అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 12వ పిఆర్సీ, వేతన 30 శాతం మధ్యంతర భృతి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజయకుమార్‌ మాట్లాడుతూ అన్ని రంగాల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తమ పాదయాత్రలో ఇచ్చిన హామీలను విస్మరించి మోసం చేసిందన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బులు ఏమయ్యాయో సమాధానం చెప్పాలని, అవసరం అయితే దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. దీక్షలో జిల్లా సహాధ్యక్షులు ఎం.మోహన్‌రావు, జిల్లా కోశాధికారి జె.వాల్యానాయక్‌, జిల్లా కార్యదర్శులు రవికుమార్‌, శ్రీనివాసరావు, ఆయేషా సుల్తానా, అజరు కుమార్‌, వెంకటేశ్వర్లు, అరుణ్‌ కుమార్‌, జిలాని, రాజ్‌ కుమార్‌, వివిధ మండల శాఖ బాధ్యులు ప్రసాద్‌, రామిరెడ్డి, గోవిందా నాయక్‌, తిరుపతిరెడ్డి, రమేష్‌ బాబు, మస్తాన్‌, భాను, గోవిందరాజు కూర్చున్నారు. నిరాహారదీక్షలో ఉన్న ఉపాధ్యాయులకు యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.విజయసారథి నిమ్మరసం అందజేసి దీక్షవిరమింప చేశారు. జిల్లా గౌరవ అధ్యక్షులు కె.శ్రీనివాసరెడ్డి, నాయకులు జి.ఆంజనేయులు, కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.రామారావు, పల్నాడు విజ్ఞాన కేంద్రం కార్యదర్శి షేక్‌ మస్తాన్‌వలి, శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారి, జనవిజ్ఞాన వేదిక నాయకులు సుభాష్‌ చంద్రబోస్‌ పాల్గొన్నారు.

➡️