బకాయిలు చెల్లించే వరకు పోరాటం ఆగదు : యుటిఎఫ్‌

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన అన్ని రకాల బకాయిలను చెల్లించే వరకు పోరాటం ఆగదని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మి రాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయ కుమార్‌, పాలెం మహేష్‌ బాబు హెచ్చరించారు. శుక్రవారం యుటిఎఫ్‌ భవన్‌లో జిల్లా ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశం నిర్వహించారు. ముందుగా యుటిఎఫ్‌ నిర్మాతల్లో ఒకరైన మైనేని వెంకటరత్నం 33వ వర్థంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, ఆయన సేవలను కొనియాడారు. అనంతరం జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షపాతిగా ఉంటామని, గత ఎన్నికలకు ముందు ప్రకటించి, ఉద్యోగులు అండదండలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి సర్కార్‌, ఉద్యోగుల పట్ల కక్షపూరిత చర్యలకు పాల్పడడం దుర్మార్గమన్నారు. ఉద్యోగులు తమ అవసరాల కోసం దాచుకున్న సొమ్మును సైతం ప్రభుత్వం తమ అవసరాలకు మళ్లించి ఉద్యోగుల అవసరాల కోసం చెల్లించకపోవడం తగదని చెప్పారు. ఉద్యోగులు కూడబెట్టుకున్న ప్రావిడెంట్‌ ఫండ్‌, ఎపిజిఎల్‌ఐ సొమ్మును ఉద్యోగులకు తెలియకుండానే వాడుకున్న చరిత్ర ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు. తాము దాచుకున్న సొమ్ము నుంచి తమ పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, గహ నిర్మాణాలు, ఇతర అవసరాల కోసం రుణాలకు దరఖాస్తు చేస్తే నెలల తరబడి చెల్లింపులు లేవని పేర్కొన్నారు. . తమ బకాయిలను చెల్లిం చాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమిస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఈ నెల 14న భోగిమంటలలో ప్రభుత్వ విధానాలను, నిర్లక్ష్యాన్ని దహించే విధంగా వినూత్నంగా కార్యక్రమాలను చేపడతామని, 19న పట్టణ, తాలూకా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. 24న జిల్లా కేంద్రంలో ప్రదర్శనలు, 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జిల్లా కేంద్రాలలో రిలే నిరాహార దీక్షలు నిర్వహి ంచాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కమిటీ తీర్మాణించిందన్నారు. వీటిని జయప్రదం చేసేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షులు వై.రవికుమార్‌, జిల్లా ట్రెజరర్‌ కె.నరసింహారావు, జిల్లా కార్యదర్శులు కె.చెన్నయ్య, సి.శ్రీనివాసులు, సి.వి.రమణ, వి.పర్వీన్‌, ఎ.శ్రీనివాసులు, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ ఎం.ప్రభాకర్‌ పాల్గొన్నారు.

➡️