బకాయిల కోసం మొక్కు తీర్చుకున్న ఉపాధ్యాయులు

Dec 26,2023 21:46

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ : రాష్ట్రంలో పని చేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగులకు సుమారు రూ.18 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిందని, ఈ బకాయిలు వెంటనే చెల్లించాలని యుటిఎఫ్‌ పాఠ్వతీపురం డివిజన్‌ శాఖ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి జగన్‌కు కొబ్బరి కాయలతో మొక్కు తీర్చుకున్నారు. స్థానిక జిల్లా ఆసుపత్రి జంక్షన్లో గల అంబేద్కర్‌ విగ్రహం వద్ద యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నానుద్దేశించి యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.మురళీమోహనరావు మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాకముందు ఉద్యోగులను స్నేహితులుగా చూసుకుంటానన్నారని, ఇప్పుడేమో శత్రువులుగా చూస్తున్నారని అన్నారు. పిఆర్‌సి, డిఎ ఎరియర్స్‌, పిఎఫ్‌ డబ్బులు, ఎపిజిఎల్‌ఐ మొదలైనవి కలిపితే సుమారు రూ.18 వేల కోట్లు బకాయిలు చెల్లించాలని, అయితే ఇందుకు ప్రభుత్వం కిమ్మనకుండా ఉందని అన్నారు. జిల్లా అధ్యక్షులు టి.రమేష్‌ మాట్లాడుతూ సంక్రాంతి లోపు ఈ బకాయిలు చెల్లించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా జగన్‌ ఫొటోకు ఉపాధ్యాయులంతా మొక్కి కొబ్బరి కొయలు కొట్టి ఏదయ్యా నీదయ మా మీద లేదా అంటూ మొక్కు తీర్చుకు న్నారు. కార్యక్రమంలు యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షులు వి.జ్యోతి, కోశాధికారి కె.మురళి, జిల్లా కార్యదర్శులు కె.భాస్కరరావు, ఎన్‌.శ్రీరాములు, బి.కూర్మారావు, పి.వెంకటి నాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️