బకాయిల కోసం యుటిఎఫ్‌ పోరుబాట

నరసరావుపేటలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

గుంటూరులో మాట్లాడుతున్న ఎన్‌.వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా, గుంటూరు : బకాయిల చెల్లింపుపై రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో గుంటూరు, పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో బుధవారం 12 గంటల ధర్నా చేపట్టారు. నరసరావుపేటలోని గాంధీపార్కు వద్ద ధర్నాను ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ప్రారంభించారు. రెండు చోట్లా ధర్నాల్లో పాల్గొన్న యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలు ఆర్థిక పరిస్థితి బాగుందని ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో ప్రకటన చేశారని, కానీ ఆర్థిక శాఖ అధికారులు మాత్రం పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని చెబుతున్నారని అన్నారు. ఏది వాస్తవమో తెలియజేస్తూ ప్రభుత్వం స్వేతపత్రం విడుదలచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. జీతాల కోసమే సొమ్ము అంతా ఖర్చు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయటం సరికాదన్నారు. ప్రజలు ఎంత పన్నులు కడుతున్నారు, వారికి ఇచ్చేది ఎంత, జీతాలకు ఇచ్చేది ఎంత, ప్రజా ప్రతినిధులకు ఇచ్చేది ఎంతో తెలియజేస్తూ సమగ్ర నివేదిక ప్రజల ముందు ఉంచాలన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.1896 కోట్లు బకాయిలు బడ్జెట్‌కు సంబందించిన డబ్బు కాదని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు దాచుకున్న సొమ్ము అని చెప్పారు. మా డబ్బులు మాకు ఇవ్వటానికి ఇన్ని ఆంక్షులు ఏంటని ప్రశ్నించారు. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం చెల్లించటం ప్రభుత్వ బాధ్యతని చెప్పారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని, సకాలంలో డిఎలు చెల్లిస్తామని, మెరుగైన పిఆర్‌సి ఇస్తామని, ప్రతి ఏటా డిఎస్‌సి నియామకాలు చేపడతామని తదితర హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. తక్షణమే బకాయిలు చెల్లించాలని, ప్రతి నెలా 1వ తేదీన జీతాలు చెల్లించాలని, లేదంటే ఈనెల 9, 10 తేదీల్లో విజయవాడలో 36 గంటల ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.ప్రేమ్‌కుమార్‌, జి.విజయసారథి మాట్లాడుతూ ఆగస్టు 23, 24 తేదీల్లో జరిగిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో 2023 సెప్టెంబర్‌ నాటికి అన్ని బకాయిలు చెల్లిస్తామని మంత్రివర్గ ఉప సంఘం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. వివిధ అవసరాల కోసం దాచుకున్న పిఎఫ్‌ లోన్లు సిలిండర్‌ లీవ్లు వంటి బకాయిలు ఫైనల్‌ పేమెంట్లు చెల్లించకపోగా ఇదేమని అధికారులు అడిగితే ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉందని అంటున్నారని విమర్శించారు. నరసరావుపేట ధర్నాకు సంఘీభావంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజరుకుమార్‌, కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.గోపాలరావు మాట్లాడారు. సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.హనుమంతరెడ్డి, ఎస్‌.ఆంజనేయ నాయక్‌, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి జి.రవిబాబు, శ్రామిక మహిళ జిల్లా సమన్వయ కమిటీ కన్వీనర్‌ డి.శివకుమారి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీశ్వరరెడ్డి మద్దతు తెలిపారు. జిల్లా గౌరవ అధ్యక్షులు కె. శ్రీనివాసరెడ్డి సహాధ్యక్షులు ఎం.మోహన్‌ రావు కోశాధికారి జె.వాల్యా నాయక్‌, జిల్లా కార్యదర్శి ఎం.రవిబాబు, ఆర్‌.అజరు కుమార్‌, పి.నాగేశ్వరరావు, సిహెచ్‌ శ్రీనివాస్‌రావు, ఎ.శ్రీనివాసరావు అయేషా సుల్తానా, అరుణకుమారి, మల్లికా బేగం, తిరుపతి స్వామి, జమాల్‌, చంద్రశేఖర్‌, ఎం.పోలయ్య, కాసిం పీరా పాల్గొన్నారు. గుంటూరు ధర్నాలో రాష్ట్ర సహాధ్యక్షులు ఎఎన్‌ కుసుమ కుమారి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ఆదిలక్ష్మి, యం.కళాధర్‌, రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్‌ యం.హనుమంతరావు, జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, ఏఎల్‌.శివపార్వతి, కోశాధికారి ఎండి.గయాసుద్దౌలా పాల్గొన్నారు.

➡️