బడ్జెట్‌ ఆమోదం కోసం..

ప్రజాశక్తి -గుంటూరు జిల్లా ప్రతినిధి : ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం బుధవారం స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జరగనుంది. చైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా అధ్యక్షతన జరగనున్న సమావేశంలో 2023-24 సవరణ బడ్జెట్‌, 2024-25 అంచనాల బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నాయి. ఈ పరిస్థితులు స్థానిక సంస్థలు ముందస్తుగానే బడ్జెట్‌ ప్రతిపాదనలు ఆమోదించి పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా పరిషత్‌ అధికారులు ప్రతిపాదనలు సభ్యుల ఆమోదంకోసం రూపొందించారు. ప్రధానంగా పంచాయతీ రాజ్‌ శాఖ ద్వారా చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు, వివిధ పద్దుల ద్వారా వచ్చే ఆదాయం, సంక్షేమ కార్యక్రమాలపై ప్రతిపాదనలు రూపొందించనున్నారు. బడ్జెట్‌ ఆమోదం తరువాత సభ్యులు పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇటీవల సంభవించిన తుపాను తరువాత రైతులకు ఎదుర్కొంటున్న సమస్యలు, రబీ సాగులో ఇబ్బందులు, సాగునీటి ఎద్దడి తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. డెల్టాలో రబీలో జొన్న, మొక్కజొన్న సాగు వద్దని, కేవలం మినుము,పెసర వేసుకోవాలని సూచించారు. ఈ అంశంపై క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చకు అవకాశం ఉంది. మిర్చి సాగుకు ఒక తడికి నీరు ఇవ్వాలని కోరనున్నారు. వైద్య ఆరోగ్యశాఖకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నా క్షేత్రస్థాయిలో వైద్యులు, సిబ్బంది సరిగా పనిచేయకపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై జెడ్‌పిటిసిలు మాట్లాడే అవకాశం ఉంది. పాఠశాలల నిర్వహణకు సంబంధించి నాడు నేడులో అసంపూర్తిగా ఉన్న పనులు, సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు అధికంగా ఉన్న జెడ్‌పి పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో సాంఘీకసంక్షేమ శాఖకు సంబంధించి వసతిగృహాల నిర్వహణపై పర్యవేక్షణ కొరవడింది. మెనూ ప్రకారం ఆహారం అందించకపోవడం, అసౌకర్యాల నడుమ ప్రభుత్వ వసతిగృహాల్లో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో రహదారులు అధ్వానంగా మారాయి. నిధుల కొరత వల్ల కనీసం ప్యాచ్‌ వర్కులు కూడా జరగడం లేదు. మినరల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ నిధులున్నా రహదారులను అభివృద్ధి చేసుకోలేకపోతున్నారు. పల్నాడులో నాలుగు కోట్ల వరకు ఎమ్‌డిఎఫ్‌ నిధులున్నాయి. గురటూరు జిల్లాలో రూ. 50 లక్షల వరకు ఉన్నాయి. ఎంపి ల్యాడ్స్‌, సచివాలయాలకు రూ.20 లక్షల నిధులతో అయినా కొన్ని రహదారులను మెరుగుపర్చుకునే అవకాశం ఉన్నా చాలావరకు ఉమ్మడి జిల్లా స్థాయిలో సమన్వయం లోపం వల్ల రహదారులు నిర్మాణానికి నోచడం లేదనే విమర్శ అధికార పార్టీ నుంచి వినిపిస్తోంది.

➡️