బతుకుపోరు బాటలో అంగన్‌వాడీలు

ప్రజాశక్తి-కనిగిరి: అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత ఎనిమిది రోజులుగా చేస్తున్న సమ్మెలో భాగంగా మంగళవారం కనిగిరి పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జివి కొండారెడ్డి మాట్లాడారు. అంగన్వాడీల పట్ల నిరంకుశంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఈ వైఖరిని విడనాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపకుండా అంగన్వాడీ కేంద్రాలను ఇతరులకు అప్పగించడం దుర్మార్గమన్నారు. హక్కులను కాల రాసేలా ప్రభుత్వ తీరు ఉందని ఇది సరికాదని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యూటీ అమలు చేయాలని కోరారు. మినీ అంగన్వాడీ సెంటర్స్‌ను మెయిన్‌ సెంటర్స్‌గా అప్‌గ్రేడ్‌ చేయాలని, మినీ అంగన్వాడీ వర్కర్స్‌కు ప్రమోషన్స్‌ ఇవ్వాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిసి కేశవరావు మాట్లాడుతూ హెల్పర్స్‌ ప్రమోషన్లలో నిబంధనలు పాటించాలని, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని, ప్రభుత్వమే కేంద్రాలకు గ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేయాలని, సూపర్వైజర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు ఎస్‌ సుజాత, మనోరంజిత, రజిని, సీత, రాజ్యలక్ష్మి నారాయణమ్మ అమల, అనిత, కవిత, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. మద్దిపాడు: మద్దిపాడులో అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం ఎనిమిదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు. ఈ సమ్మెకు మద్దిపాడు అంగన్వాడీ ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి నాతాని ధనలక్ష్మి అధ్యక్షత వహించారు. సమ్మెలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు, జిల్లా కార్యదర్శులు బంకా సుబ్బారావు, పల్లాపల్లి ఆంజనేయులు, మండల కార్యదర్శి ఉబ్బ ఆదిలక్ష్మి, ప్రాజెక్టు అధ్యక్షురాలు ఎన్‌ జయప్రద, రజిని, రాధ, ప్రమీల, ఆదిలక్ష్మి, మేరీ, ప్రభావతి, శారద, కళ్యాణి, మద్దిపాడు ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.

➡️