బయోమెట్రిక్‌ వేయించారు… రేషన్‌ మరిచారు

Apr 2,2024 20:59

 ప్రజాశక్తి – కురుపాం: బయోమెట్రిక్‌ వేయించి స్లిప్పులు ఇచ్చి మార్చి నెల రేషన్‌ బియ్యం ఇవ్వడం మానేసిన సంఘటన మండలంలోని ఉదయపురం పంచాయతీలో చోటు చేసుకుంది. ఈ పంచాయతీ పరిధిలో గల కొత్తగూడ, సంజువాయి,రెల్లిగూడ, కంటుగూడ, మల్లిగూడ, కాకితాడ, జాకిరిగూడ, మట్టిగూడ తదితర గ్రామాల్లో 410 రేషన్‌ కార్డుల లబ్ధిదారులకు మార్చి నెల రేషన్‌ ఇవ్వడం మానేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల గిరిజనులు మాట్లాడుతూ మార్చి నుంచి ఆన్‌లైన్‌ అయ్యిందని, అంతకుముందు బయోమెట్రిక్‌ వేసి పూర్తిగా రేషన్‌ ఇవ్వడం మానేసి ఇప్పుడు ఏప్రిల్‌లో బయోమెట్రిక్‌ కోసం వచ్చారని తెలిపారు. గతంలో ఆఫ్లైన్లో ఉండేటప్పుడు కూడా సగం బియ్యం ఇచ్చి సగం ఇవ్వలేదని, అంగన్వాడీ కేంద్రాలకు, పాఠశాలలకు కూడా సక్రమంగా రేషన్‌ ఇవ్వలేదని అధికారులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు వారు స్పందించలేదని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు రేషన్‌ బియ్యం సక్రమంగా అందేలా చూడాలని కోరుతున్నారు. ఈ విషయమై ప్రజాశక్తి సివిల్‌ సప్లరు డిటిని సంప్ర దించగా, విఆర్‌ఒను పూర్తిగా దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వమని ఆదేశించామని తెలిపారు.

➡️