బాధిత కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శ

Jan 4,2024 21:51

ప్రజాశక్తి – భామిని: టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును టీవీలో చూసి తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురై అక్టోబర్‌ 22న చనిపోయిన భామిని మండలం బిల్లుమడకి చెందిన బర్రి విశ్వనాధం (57) కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి గురువారం పరామర్శించారు. ఈ సందర్బంగా విశ్వనాధం భార్య బర్రి వనజాక్షి, కుమారుడు శివశంకర్‌, కూతురు గౌతమి యోగ క్షేమాలను ఆమె అడిగారు. తెలుగుదేశం పార్టీ మీ కుటుంబానికి అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని, డిగ్రీ చదువుతున్న కుమారునికి ఉద్యోగ అవకాశం కల్పిస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం విశ్వనాధం భార్య బర్రి వనజాక్షికి రూ.3లక్షలు చెక్కును అందజేశారు. భువనేశ్వరి తమ ఇంటికొచ్చి యోగ క్షేమాలు అడిగి, కుటుంబానికి భరోసా ఇవ్వడం పట్ల బాధిత కుటుంబీకులు భావోద్వేగానికి గురయ్యారు. బిల్లుమడకు వచ్చే క్రమంలో భామినిలో అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె వద్ద భువనేశ్వరికి పువ్వులు, హారతి పట్టి తమ సమస్యలు వివరించారు. అంగన్వాడీ కార్మికులకు టిడిపి అండదండలు ఎల్లవేళలా వుంటాయని, న్యాయమైన హక్కుల కోసం టిడిపి ఎప్పుడు సంఘీభావం తెలుపుతుందని తెలిపారు. భువనేశ్వరి రాకతో బిల్లుమడ ప్రధాన రహదారంతా జనాభాతో కిక్కిరిసిపోయింది. దీంతో ఆమె కారు దిగి రోడ్డుపై నడిచి ప్రజలకు అభివాదం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు, కిడారి శ్రావణ్‌ కుమార్‌, మాజీ స్పీకర్‌ కె.ప్రతిభాభారతి, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షులు వంగలపూడి అనిత, సాలూరు, గుమ్మలక్ష్మీపురం, పాలకొండ నియోజకవర్గాల టిడిపి ఇన్‌ఛార్జులు గుమ్మడి సంధ్యారాణి, తోయక జగదీశ్వరి, నిమ్మక జయకష్ణ, నియోజక వర్గ టిడిపి పరిశీలకులు కలమట విద్యాసాగర్‌, జనసేన నియోజక వర్గ సమన్వయ కర్త నిమ్మల నిబ్రం, టిడిపి మండల అధ్యక్షులు బోగాపురపు రవినాయుడు, ప్రధాన కార్యదర్శి మెడిబోయిన జగదీశ్వరరావు, మాజీ ఎంపిపి భూపతి ఆనందరావు, సర్పంచ్‌ లోపింటి రాజేష్‌, కోరాడ రాజేష్‌, సాకేటి రామారావు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️