బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రజలు క్షమించరు- సిఎఎ

ర్యాలీలో నాయకులుప్రజాశక్తి- కడప అర్బన్‌ 140 కోట్ల మంది భారతీయుల పవిత్ర గ్రంథమైన భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలనుకున్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ను భారతీయులు క్షమించరని, బిజెపి ఎత్తుగడలను, కుట్రలను చిత్తుగా ఓడించి తీరుతారని వివిధ రాజకీయ పార్టీల, ప్రజాసంఘాల నాయకులు హెచ్చరించారు. శనివారం సిఎఎ చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అల్మాస్‌ పేట సర్కిల్‌ నుంచి పాత కలెక్టర్‌ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బాబు బారు, జి.చంద్రశేఖర్‌, జి.చంద్ర, మల్లెల భాస్కర్‌, జాకీర్‌, మౌలానా, అలీ ఖాన్‌, సంపత్‌ కుమార్‌,సలావుద్దీన్‌, డాక్టర్‌ ఓబుల్‌ రెడ్డి, శివారెడ్డి, చాంద్‌ బాషా మాట్లాడారు. భారతీయుల పవిత్ర గ్రంథమైన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా పౌరులందరికీ సమానమైన అవకాశాలను విశ్వాసాలను కలిగి ఉండే హక్కును ఇచ్చిందని చెప్పారు. కాని ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న సిఎఎ మౌలిక రాజ్యాంగ లక్ష్యానికి వ్యతిరేకంగా ఉన్నదని తెలిపారు. సిఎఎ చట్టం భారతదేశ పౌరుల హక్కులను హరించడమే కాక, అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను మంటగలిపే విధంగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ఎన్నికల కోడ్‌ నేపథ్యం, మరోవైపు ముస్లిములు ఉపవాసం ఉంటున్న సందర్భంలో సమాజంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టి, దేశాన్ని అస్థిరతపరిచే ఉద్దేశంతో బిజెపి సిఎఎ చట్టాన్ని అమలు చేయడానికి నిర్ణయించిందని పేర్కొన్నారు. దీన్ని పోరాటాలతో తిప్పుకొట్టడానికి ప్రజలందరూ సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. మోడీ 10 సంవత్సరాల పాలనలో ప్రజల అభివద్ధి కోసం ఏం చేశాడో చెప్పి ఓట్లు అడగకుండా అందుకు భిన్నంగా మైనార్టీలను శత్రువులుగా చూపుతూ తన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకుని మళ్లీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతోనే ఈ సిఎఎ చట్టాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. ప్రజలు బిజెపి ప్రభుత్వ కుట్రలను అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదని, కచ్చితంగా బిజెపికి రాజకీయ సమాధి కట్టి తీరుతారని హెచ్చరించారు. రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులను అప్పుల ఊబి నుంచి విముక్తి చేయాలని, ఢిల్లీని చుట్టుముట్టి నాగళ్ళతో సవాల్‌ విసురుతూ ఉంటే దానికి సమాధానం చెప్పలేక, పరిష్కారాన్ని చూపలేక తప్పించుకుని తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఈ రైతు ఉద్యమం నుంచి ప్రజల దష్టిని మళ్లించడానికి ఆగ మేఘాల మీద ఎన్నికల ముందు సిఎఎ చట్టాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేయడం ముమ్మాటికీ పిరికిపంద చర్య అన్నారు. ఎన్‌. వెంకట శివ, రామ్మోహన్‌ రెడ్డి, ఎం. వి. సుబ్బారెడ్డి, మక్బూల్‌ బాషా, విజయలక్ష్మి, కె.సి. బాదుల్లా, దస్తగిరి రెడ్డి, చంద్రారెడ్డి, గంగా సురేష్‌, మనోహర్‌ రెడ్డి, మద్దిలేటి, వలరాజు, వెంకట్‌ రాముడు, భాగ్యలక్ష్మి, హమీద్‌, సుబ్బరాయుడు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

➡️