బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ రహస్య ఎజెండా

Feb 18,2024 21:03

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : అత్యంత సంపన్న కార్పొరేట్‌ కంపెనీల నుండి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి ఎన్నికల వ్యవస్థను తమకు అనుకూలంగా మలచుకోవడం, మతోన్మాద కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ధనాన్ని పోగుచేయడమనే ఎజెండాలో భాగమే ఎన్నికల బాండ్ల వ్యవస్థ అని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అన్నారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో వామపక్ష రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు బొత్స నరసింగరావు అధ్యక్షతన జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బంటు దాసు, గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పి సంఘం, న్యాయవాది ఎం.వెంకటరమణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు, నాయకులు బంకూరు సూరిబాబు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి.జీవ, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు కె.రాజు, పి.రాజశేఖర్‌, సింహాచలం, భాస్కరరావు తదితరులు మాట్లాడారు.2018 నుండి ఎన్నికల బాండ్ల ద్వారా జాతీయ, ప్రాంతీయ పార్టీలకు రూ.16,437 కోట్ల విరాళాలు అందగా, అందులో రూ.10,117 కోట్లు బిజెపి ఖాతాలోకి వెళ్లాయంటే ఈ విధానం ఎవరి కోసం వచ్చిందో అర్థమవుతుందనీ వాపోయారు. బిజెపి పాలనా కాలంలో కార్పొరేట్‌, మతతత్వ శక్తుల బంధం బలపడిందని, అది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని చాలా ముందుగానే సిపిఎం హెచ్చరించిందని తెలిపారు. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎలక్ట్రోరల్‌ బాండ్ల పథకం చెల్లుబాటుపై సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చిందని, ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసిందని అన్నారు. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిందన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగీవ్ర తీర్పు వారికి చెంపపెట్టు అని అన్నారు. ఇచ్చిన వారి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడమంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం స్పష్టం చేసిందని అన్నారు. ఎన్నికల బాండ్ల విధానాన్ని ప్రారంభం నుండి వామపక్షాలు అభ్యంతరం చెబుతూ చట్టసభల్లో, బయట అనేక రూపాల్లో ఆందోళనలు చేశాయన్నారు. ఇప్పటి వరకు విక్రయించిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 6 నాటికి ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని, ఎవరు, ఏ పార్టీకి ఎంత మొత్తంలో జమ చేశారనే వివరాలు మార్చి 13 నాటికి బహిరంగంగా ఉంచాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించిందని అన్నారు. ఈ ఆదేశాలు అమలైతే పాలక బిజెపి లోగుట్టు మరింత రట్టు అవుతుందన్నారు. మతం చాటున, దేశభక్తి ముసుగున సాగింది ఏమిటో కొంతైనా బట్టబయలు అవుతుందన్నారు. బిజెపి విధానం దేశభద్రతకు ప్రమాదంగా మారుతుందని, వెంటనే సుప్రీంకోర్టుకమిటీ ద్వారా ఎన్నికల బాండ్లు మొత్తం స్వీకరించిన బిజెపిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఊరూ పేరు లేకుండా ఇలా కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్‌ప్రోకో ప్రయోజనాలకు తావునిస్తాయని వక్తలు అభిప్రాయపడ్డారు. బిజెపి బండారం బయట పెట్టేందుకు పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించాలని, రౌండ్‌ టేబుల్‌ కమిటీ నిర్ణయించింది.

➡️