బిజెపి చదరంగంలో పావులైన ఆ పార్టీలు

Mar 29,2024 23:28

సభలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య
ప్రజాశక్తి – మంగళగిరి రూరల్‌ :
మతోన్మాద బిజెపి రాజకీయ చదరంగంలో టిడిపి, జనసేన, వైసిపిలు పావులని, ఈ పార్టీలన్నింటినీ ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య అన్నారు. రానున్న ఎన్నికల్లో ‘ఇండియా’ ఫోరం అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. మండలంలోని కాజ సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్‌ నాయకులు భీమిరెడ్డి సాంబిరెడ్డి 6వ వర్ధంతి శుక్రవారం జరిగింది. తొలుత సాంబిరెడ్డి చిత్రపటానికి నాయకులు పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎంపిటిసి ఈదా ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో కృష్ణయ్య మాట్లాడుతూ సిపిఎం అభ్యున్నతికి, పేదల సమస్యల పరిష్కారానికి సాంబిరెడ్డి చేసిన కృషి ఎనలేనిదన్నారు. పలు పోరాటాల్లో సాంబిరెడ్డి పాల్గొన్న తీరును గుర్తు చేశారు. అనంతరం ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఎన్నికల బాండ్ల రూపంలో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిందని, ఈ విషయాలు ప్రజలకు తెలియకుండా ప్రతిపక్ష నాయకులను నిరంకుశంగా అరెస్టు చేయిస్తోందని విమర్శించారు. దేశ వనరులు, సంపదను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతోందన్నారు. విభజన చట్టం హామీలన్నింటినీ విస్మరించిందని, రాష్ట్రానికి నిధులేమీ ఇవ్వకుండా అన్యాయం చేసిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, కడప స్టీల్‌ ఫ్యాక్టరీ, దుగ్గరాజుపట్నం పోర్టు, కేంద్ర విద్యా సంస్థలు ఇవేవీ అమలు కాలేదన్నారు. బిజెపి పాలనలో పెట్రోల్‌, డీజిల్‌, ఇతర నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని, కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలను మార్చారని మండిపడ్డారు. పంటకు మద్దతు ధర కల్పిస్తామనే హామీనీ తుంగలోతోక్కారని అన్నారు. ఢిల్లీలో సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో సాగుతున్న రైతు ఉద్యమంపై దారుణ అణచివేతకు పాల్పడిందని విమర్శించారు. ప్రతిపక్షాలపై ఇడి, సిబిఐ, ఐటి తదితర కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. మత ఘర్షణలు రేపడంతోపాటు ముస్లిములు, దళితులు, క్రైస్తవులపై దాడులు చేస్తున్నారని, రాజ్యాంగ విలువలను మంటగలుపుతున్నారని, ఈ నేపథ్యంలో బిజెపిని ఓడించి దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉద్ఘాటించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ ఒకవైపు రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసిన బిజెపితో కూటమి కట్టి మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి వైపు నడిపిస్తామని టిడిపి, జనసేన చెబుతున్నారని, రాష్ట్రానికి బిజెపి ఇప్పటి వరకు ఏం మేలు చేసిందో చెప్పాలని నిలదీశారు. మద్యాన్ని నిషేధించాకే ఓట్లు అడుగుతామని గత ఎన్నికలప్పుడు చెప్పిన వైసిపి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓట్లడుగుతుందని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించాలని కోరిన ప్రతి ఒక్కర్నీ అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. మంగళగిరి నియోజకవర్గంలో సిపిఎం అనేక పోరాటం నిర్వహించిందని, రైతు, వ్యవసాయ కూలీలు, కార్మికుల సమస్యలపైన, ఇళ్ల పట్టాల కోసం చేనేత కార్మికుల సమస్యలపైన ఉద్యమించిందని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో ‘ఇండియా’ ఫోరం బలపిచ్చే సిపిఎం, వామపక్ష పార్టీల అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సిపిఎం సీనియర్‌ నాయకులు జొన్నా శివశంకరరావు మాట్లాడుతూ కేసులకు భయపడి మోడీకి చంద్రబాబు, జగన్‌ సలాం కొడుతున్నారని, రాష్ట్రానికి అన్యాయం చేసిన మోడీని ప్రశ్నించాల్సింది పోయి కాళ్లపై పడడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై సిపిఎం రాజీలేని పోరాటాలు చేసిందని, మంగళగిరి నియోజకవర్గంలో వేలాది మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పించిందని అన్నారు. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలపై అవగాహన కలిగిన, ప్రజల కోసం పోరాడే సిపిఎం, వామపక్ష పార్టీలు, ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్‌ చెంగయ్య మాట్లాడుతూ కాజా గ్రామంలో పొలాలకు నీటి వనరుగా ఉన్న సుందరయ్య సాగరాన్ని కలుషితం చేసిన పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాలకృష్ణ మాట్లాడుతూ చేనేతకు అన్యాయం చేసిన వారు చేనేత బిడ్డ అంటూ ప్రచారం చేసుకుంటున్నారని, చేనేత గుంత మగ్గాలను అపహాస్యం చేసిన వ్యక్తుల కుమారుడు చేనేత జపం చేస్తూ ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. చేనేతలకు వైసిపి, టిడిపి ఏం న్యాయం చేశాయని ప్రశ్నించారు. సిపిఎం రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి మాట్లాడుతూ దేశ, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న పార్టీలకు సాంబిరెడ్డి స్ఫూర్తితో గుణపాఠం చెప్పాలన్నారు. సభలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇ.అప్పారావు, తాడేపల్లి రూరల్‌ మండల కార్యదర్శి డి.వెంకట్‌రెడ్డి, మంగళగిరి రూరల్‌ మండలం నాయకులు యు.దుర్గారావు, బి.కోటేశ్వరి, ఎస్‌.ఆదిశేఖర్‌, ఎ.సాంబశివరావు పాల్గొన్నారు.

➡️