బిజెపి భావోద్వేగ రాజకీయాలను తిప్పికొట్టాలి- ఇండియా కూటమి సమావేశంలో వక్తల పిలుపు

ప్రజాశక్తి – కడప భారత రాజ్యాంగ పీఠికలోని ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజం, స్వావంబలన, సామాజిక న్యాయం, సోషలిజం లక్ష్యాలను విస్మరించి దేశాన్ని విభజించి పాలించడం, భావోద్వేగ రాజకీయాలను నడుపుతోందని, వీటిని తిప్పికొట్టాలని వక్తలు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం ప్రాబల్యం కల్గిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఇండియ కూటమి ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి పదేళ్ల పాలనలో ప్రభుత్వ వ్యవస్థలన్నిటినీ ప్రయివేట్‌ పరం చేసిందన్నారు. నేడు విపక్షాలను అనిచేందుకు రాజ్యాంగ వ్యవ స్థలను వాడుకునే బిజెపి చెంచా యుగంపై పోరాటం ఉమ్మడిగా చేయాల్సిన చారిత్రిక పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో టిడిపి, బిజెపితో బహిరంగ పొత్తు, వైసిపి రహస్య పొత్తు, రాష్ట్ర అభివద్ధికి ప్రమాదంగా పరిణమించిందని పేర్కొన్నారు. కడప జిల్లా అభివద్ధి పట్టించుకోని పాలక, ప్రతిపక్ష పార్టీలు జిల్లా ప్రజల కళ్ళకు గంతలు కట్టి ఓట్లు అడుగుతున్న వైనం నేడు చూస్తున్నామని వారు ఎద్దేవా చేశారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఊసే లేదని, జిల్లాలో పారిశ్రామిక వాడ మూతలు పడి విలవిలలాడుతోందని, కొప్పర్తి ఇండిస్టియల్‌ పార్క్‌ ఎదుగు పొదుగు లేకుండా ఉందని, చెన్నూరు షుగర్‌ ఫ్యాక్టరీ మూలన పడ ిపోయిందని వాపోయారు. ప్రొద్దుటూరు, పోరు మామిళ్ల పాల ఫ్యాక్టరీలు కనుమరుగైపోయాయని పేర్కొన్నారు. మైదుకూరు దానా పరిశ్రమ, వనిపెంట ఇత్తడి పరిశ్రమ నిర్వీర్యం అయి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల యురేనియం ప్రాజెక్టు అక్కడి నీటిని, గాలిని విష తుల్యం చేశాయని పేర్కొన్నారు. పాడా అవినీతితో కూరుకుపోయిందని, కడప కలెక్టర్‌ సంతకాలు జిల్లాలో అధికార పార్టీ పెద్దలు చేసి ఎన్‌ఒసిలులు సష్టిస్తున్నారని పత్రికల్లో వార్తలు చూస్తున్నామని తెలిపారు. ప్రయివేట్‌ ల్యాండ్స్‌ సైతం భూకబ్జాలకు గురవుతూ ఉంటే పీడీయాక్ట్‌ పెట్టలేని నిస్సహాయ పరిస్థితుల్లో రెవెన్యూ అధికారులు ఉన్నారని, ఇవి చాలవంటూ ల్యాండ్‌ టైటిల్‌ చట్టం తెచ్చి పేదల అనుభవంలో ఉన్న ప్రభుత్వ భూములు చట్టబద్ధంగా లాక్కొవడానికి చూస్తున్నారని చెప్పారు. స్మార్ట్‌ మీటర్ల పేరిట వ్యవసాయాన్ని పాలకులే సంక్షోభంలోకి నెట్టుతు న్నారని వారు విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు జీర్‌ అహ్మద్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి.చంద్ర, ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎన్‌.తిరుపాల్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షులు వై. విష్ణు ప్రీతం రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అబ్దుల్‌ సత్తార్‌, విష్ణు ప్రీతమ్‌ రెడ్డి, చీకటి చార్లెస్‌, సుజాతరెడ్డి , చిన్న కుల్లాయప్ప, శ్యామలాదేవి, అలీ ఖాన్‌, సలావుద్దీన్‌, న్యాయవాది సుధాకర్‌, నాగరత్న, గౌరీ, సిపిఎం నాయకులు ఏ.రామ్మోహన్‌, బి.మనోహర్‌, సిపిఐ నాయకులు వెంకటశివ, బాదుల్లా, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు డాక్టర్‌ బి.శ్రీనివాసులు పాల్గొన్నారు.

➡️