బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఎదురుచూపులు

Dec 12,2023 14:37 #Kurnool

ప్రజాశక్తి కర్నూలు కార్పొరేషన్‌ : కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న 127 అభివృద్ధిపనులకు సంబంధించిన బిల్లులు 41 కోట్ల రూపాయల పెండింగ్లో ఉండడంతో కాంట్రాక్టర్లు తలడిల్లుతున్నారు. బిల్లులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. నగరంలో జరుగుతున్న కోట్లాది పనులకు గతంలో 60 మంది కాంట్రాక్టర్లు పనిచేసేవారు అయితే బిల్లు రాకపోవడంతో రెగ్యులర్గా 15 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఒక్కొక్కరి బిల్లులు 60 లక్షల నుండి కోటి 30 లక్షల వరకు బిల్లులు పెండింగు ఉన్నట్లు సమాచారం. కర్నూల్‌ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులలో సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు, పార్కులు, డివైడర్లు, ఫుట్‌ పాసులు, స్టేడియంలు ఉన్నాయి. ఈ పనులకు ముడి సరుకులుగా సిమెంటు, కంకర, ఇసుక, కడ్డీలు, యంత్రాలు ముఖ్యంగా కావాల్సి ఉంటుంది. అన్ని పెట్టుకొని పనులు చేసే కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు వస్తే డబ్బులు రొటేషన్‌అయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. బిల్లులు రాకపోవడంతో సిమెంటు, ఇసుక, కంకర, కడ్డీలు, ఇచ్చేవారు బిల్లు వచ్చినప్పుడు ఇస్తామంటే నిలబడే వారు ఉన్న వారం వారం పనిచేసే కూలీలకు మాత్రం తప్పనిసరిగా వారి కూలీ ఇవ్వాల్సిందే. గతంలో అప్పులు చేసి బిల్లులు రాక కాంట్రాక్టర్లు తమ స్థలాలు, పొలాలు అమ్ముకున్న రోజులు కూడా ఉన్నాయి. గతంలో పని చేస్తే వెంటనే బిల్లులు చేసి చెక్కులు రాసి ఇచ్చేవారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి బిల్లులు చేసి ప్రభుత్వ ఖాతా అయినటువంటి సి ఎఫ్‌ ఎం ఎస్‌ లో వేస్తారు. ప్రభుత్వం మంజూరు చేసి బిల్లులు వేస్తే నేరుగా కాంట్రాక్టర్ల ఖాతాలో పడతాయి. బిల్లులు చేయాలంటే కిందిస్థాయి నుండి పై స్థాయి వరకు మామూలు ఇచ్చుకోవాల్సిందే. మామూలు ఇచ్చుకోవాలంటే పనుల్లో నాణ్యత లేకుండా చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. నాణ్యత లోపాలతో పనులు పూర్తికాకముందే కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. పనులు చేసి బిల్లుల కోసం కార్యాలయం చుట్టూ అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉంది. బిల్లుల కోసం పున్నమి చంద్రుడిలా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. కర్నూల్‌ నగరంలో 52 వార్డులు ఉంటే అన్ని వార్డులలో పనులు జరగడం లేదు. డబ్బులు మిగిలే ప్రాంతాల్లో మాత్రమే కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు. దీనితో కార్పొరేటర్లు తమ వార్డులలో కూడా పనిచేయాలని కౌన్సిల్‌ సమావేశాల్లో మేయర్‌ పై ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి ఇల్లులకు సంబంధించిన డబ్బులు కాంట్రాక్టర్ల ఖాతాలో వేయాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు.

➡️