బీసీలను దగా చేసిన వైసిపి ప్రభుత్వం : టిడిపి

Feb 4,2024 23:56

వినుకొండలో పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కొల్లు రవీంద్ర, ఇతర నాయకులు
ప్రజాశక్తి – పల్నాడు జిల్లా, వినుకొండ :
అసమర్ధ పాలనలో రాష్ట్రంలో బీసీలు తీవ్రంగా నష్టపోయారని, బీసీలను దగా చేసిన జగన్‌రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని జమిందార్‌ ఫంక్షన్‌ హాలులో, వినుకొండ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద న్యాయవాది సైదారావు అధ్యక్షతన జయహోబీసీ కార్యాక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కొల్లు రవీంద్ర, జీవీ ఆంజనేయులు మాట్టాడుతూ వైసిపి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 75 మంది బీసీలను పొట్టన పెట్టుకుందని, 2500 మంది బీసీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టించిందని దుయ్యబట్టారు. 56 బీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకుండ మోసం చేసిందన్నారు. బీసీ రిజర్వేషన్లు 10 శాతం తగ్గించి ద్రోహం చేశారన్నారు. రిజర్వేషన్‌ తగ్గింపుతో రాష్ట్రవ్యాప్తంగా 16 వేల పదవులకు బీసీలు దూరమయ్యారని వివరించారు. రూ.75 వేల కోట్ల బీసీ సబ్‌ ప్లాన్‌ నిధులను దారి మళ్లించి బీసీలకు తీరని అన్యాయం చేసిందని, ప్రభుత్వం పనులు చేసిన బీసీలకు బిల్లులు నిలిపివేయటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది బీసీ భూములను దౌర్జన్యంగా ఆక్రమించారని ఆరోపించారు. రాష్ట్రంలో ‘జె’ బ్రాండ్లతో రూ.వేలకోట్లు దోచుకున్న జగన్‌రెడ్డి 3200 మంది ప్రాణాలను బలి తీసుకోవటమే కాక 35 లక్షల మంది అనారోగ్యానికి కారకుడయ్యాడని విమర్శించారు. వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అనేకమంది బీసీలపై దాడులు చేయించడం అక్రమ కేసులు బనాయించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే దుర్మార్గానికి దాసి సుబ్బారావు అనే వ్యక్తి బిల్లులు నిలిపివేయడంతో మానసికంగా కంగిపోయి అప్పుల పాలై మరణించారని చెప్పారు. రానున్నది టిడిపి-జనసేన సంయుక్త ప్రభుత్వమని, బీసీలకు పెద్దపీట వేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. టిడిపి అధికారంలోకి రాగానే బీసీ రక్షణ చట్టాన్ని తీసుకువచ్చి బీసీలకు అండగా ఉంటామన్నారు. టిడిపి నరసరావుపేట నియోజకవర్గం ఇన్‌ఛార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, నాయకులు ఎన్‌.రామచంద్ర ప్రసాద్‌, టి.చంద్రశేఖర యాదవ్‌, జి.నాగేశ్వరరావు, పి.సైదారావు, జి.రామకృష్ణ, హనుమంతు రాజు పాల్గొన్నారు.

➡️