బెదిరిస్తే పోరాటం మరింత ఉధృతం

ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుండా, బెదిరింపులకు పాల్పడితే భయపడేది లేదని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకూ సమ్మె కొనసాగుతుందని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ స్పష్టం చేశారు. గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట, పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని ధర్నా చౌక్‌లో ఏర్పాటు చేసిన సమ్మె శిబిరాలకు కార్యకర్తలు, ఆయాలు రెండో రోజు రెట్టించిన ఉత్సాహంతో హాజరయ్యారు. నల్ల చీరలు ధరించి ఆందోళనలో పాల్గొన్నారు. గుంటూరు, నరసరావుపేటలో శిబిరాలను ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు సందర్శించి మద్దతుగా మాట్లాడారు. గుంటూరులో యూనియన్‌ నగర కార్యదర్శి టి.రాధ అధ్యక్షతన జరిగిన సమ్మె శిబిరంలో ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ఉందన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తకు రూ.11500, హెల్పర్‌కు రూ.7 వేలు ఇస్తున్నారని చెప్పారు. తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తామని జగన్మోహన్‌రెడ్డి వాగ్దానం చేశారని, తెలంగాణలో అంగన్‌వాడీలకు రూ.13650 ఇస్తున్నారని తెలిపారు. వేతనాలు పెంచాలని, సుప్రీం కోర్టు ప్రకారం గ్రాట్యుటీ అమలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. అంగన్‌వాడీలను నిర్లక్ష్యం చేయొద్దని, తెలంగాణ ఎన్నికల ఫలితాలను గుర్తించాలని, కేవలం 2 శాతం ఓట్లతో ప్రభుత్వం ఓటమిపాలైందని అన్నారు. సిఎం జోక్యం చేసుకొని సమస్యలు పరిష్కరించాలని కోరారు. సుబ్బరావమ్మ మాట్లాడుతూ సమ్మె ప్రారంభమయ్యాక అధికారుల బెదిరింపు ధోరణిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. చిన్నచిన్న డిమాండ్లు పరిష్కారం చేశామని చెప్పటం సంతోషమేనని, అయితే ప్రధాన సమస్యలను విస్మరించడం సరికాదన్నారు. అంగన్‌వాడీలకు ఇస్తున్న వేతనాలు ఏమాత్రమూ సరిపోవట్లేదని, గ్యాస్‌, కరెంటు బిల్లులు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని, వాటిలో సగం వేతనం సెంటర్ల నిర్వహణకే పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని తెలిపారు. తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తామని జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు కోసం నాలుగేళ్లుగా శాంతి యుతంగా అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోలేదన్నారు. అంగన్‌వాడీలను బెదిరిస్తే బెదురుతారని అనుకోవటం అపోహేనని, అంగన్‌వాడీల ఉద్యమ చరిత్రను గుర్తెరగాలని హితవు పలికారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమ్మెకు పలు సంఘాలు మద్దతు తెలిపాయి. టిడిపి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నజీర్‌ అహ్మద్‌, పత్తిపాడు ఇన్‌చార్జి బి.రామాంజనేయులు మద్దతు పలికారు. అంగన్‌వాడీలకు గతంలో రెండు వేతనాలు పెంచింది టిడిపి ప్రభుత్వం అని గుర్తు చేశారు. వారి న్యాయమైన సమస్యలకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం నాయకులు వివికె.సురేష్‌, ఆర్‌పిల యూనియన్‌ నగర ప్రధాన కార్యదర్శి రమాదేవి, ఆటో యూనియన్‌ నాయకులు జి.శంకర్‌, అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ యూనియన్‌ నాయకులు నరసయ్య, గౌరవాధ్యక్షులు నికల్సన్‌ మద్దతు పలికారు. సిఐటియు నాయకులు బి.ముత్యాలరావు, కె.శ్రీనివాసరావు, అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దీప్తి మనోజ, నాయకులు చిన వెంకాయమ్మ, పద్మ, రమణ, వేదవతి పాల్గొన్నారు.

అంగన్వాడీలు పల్నాడు జిల్లాలో చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని గాంధీపార్కు వద్ద ధర్నా చౌక్‌లో నరసరావుపేట ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీలు నిరసన తెలిపారు. సమ్మె శిబిరాన్ని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఐసిడిఎస్‌కు నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతోందని, అంగన్వాడీ వ్యవస్థ నిర్వీర్యమైతే దేశంలో పోషకాహార లోపం పెరిగి ఆకలి సూచిలో భారతదేశం స్థానం మరింత దిగజారుతుందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన సరుకులు సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. అనేక యాప్‌ లు ప్రవేశపెట్టి వర్కర్లపై తీవ్రమైన పని ఒత్తిడి పెంచిందన్నారు. ప్రభుత్వ పెద్దలతో చర్చించిన క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి వేతనాల పెంపు, గ్రాట్యుటీ మినహా సిఎం పరిధిలో ఉంటాయన్నారని, మిగతా తమ పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారని తెలిపారు. రాజకీయంగా ముఖ్యమంత్రికి, పరిపాలన అధికారికి ఉద్యోగుల వ్యవహారంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నా ఆ దిశగా ఆలోచన చేయడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడిలు 1.20 లక్షల మంది ఉన్నారని, వారి కుటుంబ సభ్యులు కూడా ఉంటారని, ప్రభుత్వం స్పందించకుంటే రానున్న ఎన్నికల్లో వైసిపికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఎపి అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షురాలు కెపి మెటిల్డాదేవి, ఎఐటియుసి రాష్ట్ర సహాయ కార్యదర్శి హెల్డా ఫ్లారిస్‌ మాట్లాడుతూ 2017 నుండి పెండింగ్‌లో ఉన్న టీఏ, డీఏ బిల్లులు చెల్లించాలని, మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని, ప్రమోషన్లలో రాజకీయ జోక్యం మానుకోవాలని, నాణ్యమైన సెల్‌ ఫోన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వీటిని పరిష్కరించే వరకూ సెంటర్లను తెరిచే ప్రసక్తే లేదన్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో పోలిస్తే అంగన్వాడీ వర్కర్‌కు ఇచ్చే రూ.11 వేలు, హెల్పర్‌కు ఇచ్చే రూ.7 వేలు ఏ మాత్రం సరిపోవన్నారు. సమ్మెకు మద్దతుగా టిడిపి నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ చదలవాడ అరవింద్‌బాబు మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి రాగానే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని, సెంటర్లకు నాణ్యమైన సరుకులు ఇచ్చేలా చూస్తామని చెప్పారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్‌ సిలార్‌ మసూద్‌, డి.మాధవి, ఎం.కవిత, యు.పద్మ, బివి రమణ, ఎఐటియుసి నాయకులు టి.విజయలక్ష్మి, బి.విజయకుమారి, కె.రాంబాబు, యు.రంగయ్య, వెంకట్‌, తెలుగు మహిళా నాయరకులు డి.ఉదయశ్రీ, కె.రాధిక పాల్గొన్నారు.

➡️