బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు వేగవంతం చేయాలి : ఇఒ

ప్రజాశక్తి-ఒంటిమిట్ట ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో ఏప్రిల్‌ 16న అంకురార్పణ, ఏప్రిల్‌ 17న శ్రీరామనవమి పర్వదిన ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని టిటిడి ఇఒ ఎవి.ధర్మారెడ్డి అధికా రులను ఆదేశించారు. బ్రహ్మో త్సవాల ఏర్పాట్లపై బుధవారం తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని సమావేశ మంది రంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఏప్రిల్‌ 22న జరుగనున్న శ్రీసీతారాముల కల్యాణం ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కల్యాణం రోజున వచ్చే వేలాది మంది భక్తులకు అవసరమైన అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ అందించేందుకు చక్కటి ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని విభాగాలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని కల్యాణం రోజున భక్తులకు అందాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కల్పించేందుకు భక్తులు నడిచే ప్రాంతాల్లో కూల్‌ పెయింట్‌ వేయాలని, అవసరమైన చోట్ల చలువపందిళ్లు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఊరేగింపు నిర్వహించే వాహనాలు, రథానికి సంబంధించిన పటిష్టతను పరిశీలించి ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ తీసుకోవాలన్నారు. సీతారాముల తలంబ్రాల ప్యాకింగ్‌కు 300 మంది, కల్యాణం రోజున భక్తులకు అన్నప్రసాదాలు, తలంబ్రాల పంపిణీకి దాదాపు 2 వేల మంది శ్రీవారి సేవకులను సిద్ధం చేసుకోవాలన్నారు. అత్యవసర వైద్య పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు వీలుగా అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకో వాలని, ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటుచేసి తగినన్ని ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య అధికారులకు సూచించారు. సాంస్క తిక, సంగీత కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళిక త్వరితగతిన సిద్ధం చేయాలన్నారు. కల్యాణం రోజున భక్తుల రవాణా, వసతి, పార్కింగ్‌ కల్పించేందుకు ఆర్‌టిసి అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు పూర్తి సన్నద్ధంగా ఉండి వైఎస్‌ఆర్‌ జిల్లాలోని ఆయా విభాగాల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సమావేశంలో జెఇఒ వీరబ్రహ్మం, సివిఎస్‌ఒ నరసింహ కిషోర్‌, ఎస్‌విబిసి సిఇఒ షణ్ముఖ కుమార్‌, సిఇ నాగేశ్వరరావు, ఎస్‌ఇలు జగదీశ్వర్‌రెడ్డి, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, ఎస్టేట్‌ ఆఫీసర్‌ గుణభూషణరెడ్డి, డెప్యూటీ ఇఒలు నటేష్‌ బాబు, ప్రశాంతి, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

➡️