భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలి

Jan 14,2024 21:06

ప్రజాశక్తి – సీతానగరం : రైతులకు నష్టదాయికమైన భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్మునాయుడు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం జిఒ కాపీలను భోగిమంటల్లో వేసి దగ్ధం చేశారు. అనంతరం లక్ష్మునాయుడు మాట్లాడుతూ ప్రపంచ వాణిజ్య సంస్థ సలహా మేరకు నీతి ఆయోగ్‌ 2019లో ప్రతిపాదించిన ఈ చట్టం దేశంలో ఆమోదించిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని, ఇది గొప్ప గర్వం కాదు గొప్ప లొంగుబాటని ఎద్దేవా చేశారు. 2008లో పార్లమెంట్‌ ఆమోదించిన సమగ్ర భూ సర్వే చట్టంలోని రాష్ట్ర ల్యాండ్‌ అథారిటీ ఏర్పాటు చేయడం న్యాయవ్యవస్థకు సంబంధం లేకుండా ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడమేనన్నారు. దీనివల్ల రాష్ట్రంలో భూ యజమానులకు అనేక కష్టాలు రావడం వల్ల గ్రామాల్లో అంత:కలహాలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందన్నారు. కావున వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతులు పైల విశ్వనాథం, పాపారావు తదితర రైతులు పాల్గొన్నారు. పాచిపెంట: మండల కేంద్రంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు బోను గౌరు నాయుడు ఆధ్వర్యంలో భూమి హక్కుల యాజమాన్య చట్టానికి సంబంధించిన కాపీలను ఆదివారం జరిగే భోగిమంటల్లో వేసి దగ్ధం చేశారు. అలాగే గౌరవ వేతనం తీసుకుంటున్న అంగన్వాడీలపై ఎస్మాను ప్రయోగించడం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తగదని, రాజ్యాంగాన్ని గౌరవించి రైతాంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ల లాభాలు కోసం రైతులను, ప్రజలను బలి చేస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి అనాలోచిత విధానాలను మానుకోవాలని భవిష్యత్‌ పోరాటాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు సిహెచ్‌ పోల్రాజు, కోరాడ ఈశ్వరరావు, రైతు సంఘం నాయకులు పల్లె రామారావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాచిపెంట మండల కార్యదర్శి బోను గౌరు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగింది

➡️