భోజన కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలి

Feb 1,2024 20:39

ప్రజాశక్తి – సాలూరు: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ గురువారం ఎపి మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం నాయకులు ఎంఇఒ రాజ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. సంఘం గౌరవాధ్యక్షులు ఎన్వైనాయుడు, నాయకులు విజయ, సుశీల ఆధ్వర్యాన కార్మికులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి గతంలో పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనం రూ.10వేలు ఇవ్వాలని, ప్రభుత్వమే గ్యాస్‌ ఉచితంగా పంపిణీ చేయాలని డిమా ండ్‌ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, మెనూ చార్జీలు పెంచాలని కోరారు.సీతంపేట : మండలంలోని మధ్యాహ్న భోజన పథకం కార్యకర్తలు ఎంఇఒ ఆనందరావుకు గురువారం తమ సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రం అందజేశారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షు డి.రమణారావు మాట్లాడుతూ సిఎం జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాక ముందు పాదయాత్ర సందర్భంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. పథకం అమలుకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించరాదన్నారు. అలాగే వంట చేసేటప్పుడు అగ్ని ప్రమాదానికి గురైన వారికి నష్ట పరిహారం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఎం.కాంతారావు, మధ్యాహ్న భోజన పథకం అధ్యక్ష కార్యదర్శులు ఉషా, రొయిబారి, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.గరుగుబిల్లి : మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో ఎంఇఒకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘం నాయకులు పి.పావని మాట్లాడుతూ దీర్ఘకాలంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేనిచో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ చాలా కష్టతరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరచూ మెనూ మారుస్తున్నప్పటికీ మెస్‌ఛార్జీలు, మధ్యాహ్న భోజన నిర్వాహకుల జీతాలు పెంచడం లేదని విమర్శించారు. ఇఈ సమస్యలపై ఈనెల 5న కలెక్టరేట్‌ వద్ద జరిగే ధర్నాలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు బోను లక్ష్మి, అన్నపూర్ణమ్మ, రోహిణి, పార్వతి తదితరులు పాల్గొన్నారు.

➡️