మంత్రి సురేష్‌ కనబడుటలేదు

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కనిపించడం లేదంటూ ఆయన నియోజకవర్గమైన యర్రగొండ పాలెంలో గోడలపై అక్కడక్కడా పోస్టర్లు ప్రత్యక్షమ య్యాయి. యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి ఐదు సంవత్సరాలు పూర్తి మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్‌ను యర్రగొండపాలెం నుంచి కొండపికి బదిలీ చేశారు. దీంతో ఆయన అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటూ ఓటర్లను కలిసే పనిలో ఉన్నారు. యర్రగొండపాలేనికి ఎమ్మెల్యే అభ్యర్థిగా తాటిపర్తి చంద్రశేఖర్‌ను నియమించారు. అయితే ఇలా స్థల మార్పిడి జరిగిన ప్రతి చోటా ఒకరికి ఒకరు సహకరించుకుంటూ రెండు నియోజకవర్గాల్లో ఇరువురు నేతలు ఉమ్మడి పర్యటనలు చేసుకుంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కాగా యర్రగొండపాలెంలో మాత్రం తాటిపర్తి చంద్రశేఖర్‌ ఒంటరిగానే తిరుగుతున్నారు. మంత్రి సురేష్‌ను పిలిపించుకొని పరిచయం చేసుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. దీనికి తోడు యర్రగొండపాలెంలో సిఎం బహిరంగ సభ ఉందంటూ స్థల పరిశీలన చేసేందుకు సైతం మంత్రి సురేష్‌ వచ్చారు. ఆ కార్యక్రమంలో సమన్వయకర్త చంద్రశేఖర్‌ కూడా పాల్గొన్నారు. కానీ ఇద్దరూ ఎడముఖం పెడముఖంగానే ఉన్నారని ఆ పార్టీ నేతలు గుసగుసలాడు తున్నారు. ఈ క్రమంలోనే యర్రగొండపాలెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో, ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో పోస్టర్లు ప్రత్యక్షం కావడం పట్టణంలో చర్చానీయాంశంగా మారింది. ఈ పని ఎవరు చేసి ఉంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి వాటిని పరిశీలిస్తే అసలు విషయం బయట పడుతుందని నేతలు చెబుతున్నారు. మరి ఆ దిశగా పరిశీలిస్తారో, మొదట్లో మంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట చంద్రశేఖర్‌ ఫ్లెక్సీలు చింపిన విధంగా ఈ పోస్టర్లు కూడా ప్రత్యక్షమయ్యాయని ఊరుకుంటారో వేచి చూడాల్సిందే. పోస్టర్ల ఏర్పాట్లు టీడీపీ ట్రిక్‌: మంత్రి కార్యాలయం యర్రగొండపాలెంలో పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కనపడటం లేదంటూ వెలసిన పోస్టర్లపై మంత్రి కార్యాలయం తీవ్రంగా స్పందించింది. వైసీపీలోని ఒక వర్గం ఈ పోస్టర్లను ఏర్పాటు చేసిందని ప్రచారం చేయటాన్ని ఖండించింది. మంత్రి కనబడటం లేదని వైసీపీ వాళ్లు పోస్టర్లు వేయవలసిన అవసరం లేదని, మంత్రిగా, స్థానిక ఎమ్మెల్యేగా గత నాలుగున్నర ఏళ్లుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. కొండపి సమన్వయకర్తగా మంత్రి సురేష్‌ వెళ్లిన తర్వాత యర్రగొండపాలెం సమన్వయకర్తగా చంద్రశేఖర్‌ను నియమించారని, ఆయన యర్రగొండ పాలెంలో అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న చీప్‌ పాలిటిక్స్‌ అని తెలిపారు. కొండపి ప్రజలకు మంత్రి సురేష్‌ గురించి తప్పుడు ప్రచారం చేయాలంటే యర్రగొండపాలెంలో బురద చల్లాలనేది టిడిపి కుట్ర అని అన్నారు. కొండపిలో టిడిపి నాయకులు ఎన్నో రకాలుగా దుష్ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని, ప్రజలు అమాయకులు కాదని తెలిపారు. ఈ పోస్టర్ల వ్యవహారం వెనక ఎవరున్నారనేది ప్రజల ముందు ఉంచుతామని అన్నారు.

➡️