మదనపల్లెను జిల్లా కేంద్రం చేస్తా

ప్రజాశక్తి – కడప ప్రతినిధిఅన్నమయ్య జిల్లా పరిధిలోని పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి పరిసర ప్రాంతాలను కలుపుతూ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని తెలుగేదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శని వారం జిల్లాలోని పీలేరులో రా..కదలి రా బహి రంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల యుద్ధంలో రాజంపేట పార్లమెంట్‌ పరిధిలోని టిడిపి అసెంబ్లీ, ఎంపీ అభ్యర్థులను ఆదరిం చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజంపేట పార్లమెంట్‌ పరిధిలోని ఖరీదైన వనరులను అధికార వైసిపి ఎమ్మెల్యేలను ఇష్టానుసారంగా దోచుకున్నారని తెలిపారు. రాజంపేట, రైల్వేకో డూరు, పీలేరు నియోజకవర్గ కేంద్రాల పరిధి లోని బెరైటీస్‌ మొదలుకుని ఎర్రచందనం, ఇసుక, భూములను అప్పనంగా బొక్కేశారని విమర్శించారు. ఇదీ చాలక పోవడంతో పీలేరు మూలుగను సైతం పీల్చే శారని విమర్శిం చారు. కలికిరి, గుర్రకొండ ప్రాంతాల్లోని మైనింగ్‌ను ఇష్టానుసారంగా కబ్జా చేశారన్నారు. పాపాల పెద్దిరెడ్డీ నీ అవినీతి బాగోతం గురించి తెలిసి పోయిందని తెలిపారు. కుప్పంలో పోటీ చేస్తాడని, ముందు పుంగనూరును కాపాడుకోవాలని, పుంగనూరులో టిడిపి జెండా ఎగుర వేయడం ఖాయమని తెలిపారు. ఏడాది కిందట వైనాట్‌ 175 అన్నారని, ఇప్పుడేమో 69 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారనే భయంతో వారి సీట్లను మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. వైనాట్‌ పులివెందుల అని, పులివెందుల్లో టిడిపి గెలుపు తథ్యమన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసిపిని భూస్తాపితం చేస్తామని తెలిపారు. అన్నమయ్య డ్యామ్‌ తెగిపోయి మూడేళ్లవుతోందని, ఇప్పటి వరకు పునరుద్ధరణ పనులు చేపట్టకుండా ఏమి చేస్తున్నావని నిలదీశారు. పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి ప్రాంతాల్లో టమోటాను పెద్ద ఎత్తున పండిస్తారని, కానీ స్థిరమైన ధరలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. టిడిపి అధికారంలోకి వస్తే టమోటా పంటకు గిట్టు బాటు ధర కల్పిస్తామన్నారు. కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేయడం తోపాటు ఫుడ్‌ప్రాసెసింగ్‌ సంస్థలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిత్యావసరాల ధరలను దించే బాధ్యతల్ని తీసుకుం టామన్నారు. పీలేరు అసెంబ్లీ ఇన్‌ఛార్జి నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వస్తే ఎప ిఐఐసి భూముల్లోకి పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. పార్ల మెంట్‌ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. 2019 నుంచి పార్టీ తలపెట్టిన యువగళం, మినీ మహానాడు, సబ్‌జైలు సందర్శన వంటి కార్యక్రమాలను జయప్రదం చేయడంలో కార్యకర్తలు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌.శ్రీనివాసులురెడ్డి, మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, రాజంపేట పార్లమెంట్‌ టిడిపి జిల్లా అధ్యక్షులు చమర్తి జగన్‌మోహన్‌రాజు, పీలేరు అసెంబ్లీ ఇన్‌ఛార్జి నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, తంబళ్లపల్లె, రాజంపేట, రాయచోటి ఇన్‌ఛార్జులు శంకర్‌ యాదవ్‌, బత్యాల చెంగల్రాయులు, రమేష్‌కుమార్‌రెడ్డి, నాయకులు గంటా నరహరి, చల్లామధు, పర్వీన్‌తాజ్‌, సూర్యప్రకాష్‌రెడ్డి, ఎద్దుల సుబ్బరాయుడు, పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️