మలి జాతరకూ పోటెత్తిన జనం

Jan 30,2024 20:33

ప్రజాశక్తి – మక్కువ : ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దేవత శంబర పోలమాంబ అమ్మవారి జాతరకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కలు తీర్చుకున్నారు. మంగళవారం స్థానిక వనంగుడి, చదురు గుడుల వద్ద పెద్దసంఖ్యలో భక్తులు క్యూలైన్‌లో బార్లు తీరారు. మొదటి వారం కంటే మారుజాతరకే భక్తులు పాల్గొని తొలి జాతరను మరిపించారని పలువురు విశ్లేషించారు. జాతర సందర్భంగా సాలూరు సిఐ ధనుంజయరావు ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మక్కువ ఎస్‌ఐ నరసింహమూర్తి రెండు ఆలయాల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు చక్కదిద్దారు. గతవారం జాతరకు వాతావరణంలో మబ్బులు ఏర్పడగా ఈసారి జాతరకు వచ్చే భక్తులకు ఎండ తీవ్రత తప్పలేదు. వనంగుడి వద్ద ఎండలోనే ఎక్కువ శాతం భక్తులు బారులు తీరాల్సి వచ్చింది. కింద సిమెంట్‌ రోడ్డు పైన ఏకధాటిగా ఎండ తగలడంతో భక్తులు కాస్త ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఆలయం క్యూలైన్‌ పొడవునా టెంట్లు వేసి ఉంటే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. వనం గుడి వెనుక భాగంలో ఉన్న వేప చెట్టుకు పెద్ద ఎత్తున భక్తులు పూజలు చేశారు. అమ్మవారికి పసుపు, కుంకుమ దీపదూపాలు ఈ సందర్భంగా సమర్పించుకున్నారు. దేవాదాయ శాఖ అమ్మవారిని దర్శించుకుని వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా ప్రసాదాలను అందజేశారు. సిసి ఫుటేజ్‌ను పరిశీలిస్తూ క్యూలైన్లోని ఎక్కడా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు ఇఒ వివి సూర్యనారాయణ చేపట్టారు. మారుజాతర ప్రశాంతంగా ముగియడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు.జనసేన ఆధ్వర్యంలో పులిహోరా, వాటర్‌ ప్యాకెట్లుజాతరకు వచ్చే భక్తులకు జనసేన సాలూరు నియోజకవర్గం, నాయకులు రిసివర్ధన్‌ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత పులిహౌరా, వాటర్‌ ప్యాకెట్లను మక్కువ- శంబర రహదారి మార్గంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల నాయకులు వి సుగుణేశ్వరరావు, పాపారావు తదితరులు పాల్గొన్నారు

➡️