మహిళల ఆర్థిక పరిపుష్టికి ఊతం : కలెక్టర్‌

Dec 9,2023 20:38

ప్రజాశక్తి – పార్వతీపురం  : మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఆర్థిక పరిపుష్టి సాధించేలా ప్రభుత్వం ఊతం అందిస్తుందని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. స్థానిక కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో జిల్లా గ్రామీణ అభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉన్నతి మహిళా శక్తి పథకం కింద మహిళలకు కలెక్టరేట్‌లో శనివారం ఆటోలను పంపిణీ చేశారు. అనంతరం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు ఆత్మస్థైర్యంతో అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలన్న ఉన్నతమైన ఆశయంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఆటో నడుపుకొని వచ్చిన ఆదాయంతో జీవన ప్రమాణాలను పెంపొందించు కోవాలని సూచించారు. స్వయంశక్తి సంఘాల్లోని అర్హత కలిగిన షెడ్యూల్‌ తెగలు, కులాలకు చెందిన మహిళలకు ఉన్నతి పథకం ద్వారా వడ్డీ లేని రుణాలతో ఆటోలను పంపించేస్తున్నామన్నారు. జిల్లాకు 8 ఆటోలు మంజూరు కాగా, ప్రస్తుతం ఐదు ఆటోలు లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. లబ్ధిదారులకు రూ.3 లక్షలు వరకు వడ్డీలేని రుణాలు అందజేస్తున్నామన్నారు. ఒక్కో లబ్దిదారు పది శాతం వాటాను మూలధనంగా పెట్టుబడిపెట్టి నెలసరి వాయిదా కింద రూ.6,200 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పి.కిరణ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️