డయేరియా ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు

Jun 28,2024 21:48

కురుపాం:  గ్రామాల్లో డయేరియా బారిన ప్రజలు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లదేనని ఆర్‌డబ్ల్యుఎస్‌ డిఇ కె.నాగేశ్వరరావు అన్నారు . శుక్రవారం నియోజకవర్గ కేంద్రమైన కురుపాంలో గల వెలుగు కార్యాలయం వద్ద ఐదు మండలాల ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇలకు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు గ్రామాల్లో డయేరియా ప్రబలకుండ ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. గామీణ నీటి సరఫరా పారిశుధ్య కమిటీలను బలోపేతం చేయాలన్నారు. నీటి సరఫరా చేసే ట్యాంకులను శుభ్రపర్చి బ్లీచింగ్‌ క్లోరినేషన్‌ చేయించి పరిశుభ్రమైన నీటిని ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో ప్రతి ఇంటి వద్ద ప్రజలు వేడి చేసే నీటిని తాగేలా అవగాహన కల్పించాలన్నారు. అప్పుడే ప్రజలు డయేరియా బారిన పడకుండా రక్షించుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో డిపిఎంయు సిబ్బంది ఆర్‌.లక్ష్మణ్‌, ఎం.రాఘవరావు, జి.విజయబాబు, బి.సుజాత, ఐదు మండలాల ఎఇలు అర్‌. వేణుగోపాల్‌, ఎ.నవీన్‌, వై.భరత్‌, జి.గౌరీశంకర్‌, ఎన్‌.ప్రవీన్‌, ల్యాబ్‌ పర్సన్లు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

➡️