విత్తన కంపెనీ డబ్బుల చెల్లింపుపై విచారణ

Jun 28,2024 21:49

పాచిపెంట : 2023 ఖరీఫ్‌ సీజన్లో పండించిన కావేరి కంపెనీ సీడ్‌ ప్రొడక్షన్‌కు సంబంధించిన డబ్బులు ఇంతవరకూ అందలేదని, కొంతమందికి మాత్రమే ఇచ్చి ఇంకా కొంతమందికే ఇవ్వలేదని విశ్వనాధపురం రైతులు కలెక్టర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయ అధికారి సూచనలతో సాలూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఎం.మధుసూదనరావు, ఎఇ కె.తిరుపతిరావు రైతుల సమక్షంలో శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా 32 మంది రైతులు సుమారు 104 ఎకరాల్లో ఖరీఫ్‌ సీజన్లో కావేరి కంపెనీకి సంబంధించిన మొక్కజొన్న పండించారు. అయితే ఈ విత్తనాలకు నాటకపోవడంతో నష్టపరిహారం ఎకరాకు రూ.30 వేలు చొప్పున పరిహారం ఇస్తామని కావేరి కంపెనీకి చెందిన ఆర్గనైజర్‌ వేమూరి వంశీకృష్ణ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో కొంతమంది రైతులకు మాత్రమే పరిహారం చెల్లించి, మిగిలిన వారికి చెల్లించలేదని రైతులు తెలిపారు. అలాగే 2023 రబీ సీజన్లో 8మంది రైతులకు సిపి కంపెనీకి చెందిన సుమారు రూ.2లక్షలు చెల్లించలేదన్నారు. ఈ విషయమై కంపెనీ ఆర్గనైజర్‌ను ప్రశ్నించగా అందరికీ జులై 3న చెల్లిస్తానని తెలిపారు. ఇప్పటి వరకు ఎందుకు చెల్లించలేదని రైతులు నిలదీశారు. ఈ సందర్భంగా ఎడి మధుసూదన్‌రావు మాట్లాడు తూ కంపెనీకి చెందిన విత్తనాలు వేసేటప్పుడు రైతు ఆర్‌బికెలకు తెలియజేయాల న్నారు. అలాగే కంపెనీ వాళ్లు కూడా ఏఏ విత్తనాలను ఎంతమంది రైతులకు ఏఏ గ్రామాల్లో సరఫరా చేస్తున్నారో ముందుగానే తెలియజేసినట్లయితే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్త పడొచ్చన్నారు. రైతులతో ఒప్పంద పత్రాలను, బిల్లులను, రైతులకు ఇచ్చిన రసీదులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో విఎఎ బోను మోహన్‌, రైతులు పాల్గొన్నారు.

➡️