మహిళల సారధ్యంలోనే ఉద్యమాలు విజయవంతం

Mar 8,2024 20:40

  ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : మహిళలు ఉద్యమాల్లోకి వచ్చి సారధ్యం వహిస్తే తప్పక విజయవంతమవుతాయని ప్రముఖ కవి గంటేడ గౌరి నాయుడు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక ఎన్జీవో హోంలో యుటిఎఫ్‌, సిఐటియు, ఐద్యా సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సదస్సులో ఆయన మాట్లాడారు. 42 రోజల అంగన్‌వాడీల పారాటం స్ఫూర్తిదాయకంగా జరిగిందని, మహిళలు ఎక్కువగా పాల్గొన్నారు కనుకనే ప్రభుత్వం కూడా మెట్టుదిగి కొన్ని సమస్యలను పరిష్కరించిందని అన్నారు. సిఐటియు నాయకులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రస్తుత పాలకులు, బిజెపి ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తుందని, ఈ దాడిని తిప్పి కొట్టడంలో మహిళలు ప్రముఖ పాత్ర వహించాలని కోరారు. ఐద్వా జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీదేవి మాట్లాడుతూ పార్లమెంట్‌, శాసన సభల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ రాజామణి అధ్యక్షత వహించిన సదస్సులో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి.రమేష్‌, ఎస్‌.మురళీమోహనరావు, అంగన్వాడీ నాయకురాలు అలివేలుమంగ, ఉపాధ్యాయులు, మహిళలు పాల్గొనగా యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి గోవిందమ్మ వందన సమర్పణ చేశారు.

మహిళల సారధ్యంలోనే ఉద్యమాలు విజయవంతం

గుమ్మలక్ష్మీపురం : మహిళల రక్షణకై ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంతో దేశంలో ఎక్కడ చూసినా ప్రతిరోజు ఏదో ఒకచోట వీరిపై దాడులు జరుగుతున్నాయని శ్రామిక మహిళా సంఘం నాయకులు వి.ఇందిరా అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక గిరిజన సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో మద్యం ఏరులై పారడంతో మహిళలకు రక్షణ కరువైందన్నారు. మహిళలపై దాడులు జరుగుతున్నా దోషులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడంతో దాడులు ఆగడం లేదన్నారు. దిశ, నిర్భయ వంటి మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మరోవైపు శ్రామిక మహిళలు శ్రమ దోపిడీకి గురవుతున్నారు తప్ప వారికి సంక్షేమం కరువైందన్నారు. కావున మహిళలు హక్కులు, చట్టాల కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో ఐద్వా మంల కార్యదర్శి కె.లక్ష్మి, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోలక అవినాష్‌, కోశాధికారి మండంగి రమణ, యుటిఎఫ్‌ మండల నాయకులు భారతి, పలువురు ఉపాధ్యాయులు, మహిళలు పాల్గొన్నారు. వీరఘట్టం : మహిళపై జరుగుతున్న అత్యాచారాలు అరికట్టాలని అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు నర్సిపురం దుర్గా చంద్ర చూడామణి కోరారు. స్థానిక సిపిఐ( ఎంఎల్‌) కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి పాలనలో మహిళలకు రక్షణ కరవైందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా నాయకులు గడగమ్మ, గౌరీశ్వరి మాట్లాడుతూ సమాన హక్కులు, అవకాశాల కోసం పోరాడాలని మహిళలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డి.సూర్య కళ, తదితర మహిళలు పాల్గొన్నారు.

కురుపాం : మహిళలు చైతన్యంతో ఉంటేనే దేశాభివృద్ధికి సాధ్యపడుతుందని ఎంపిపి శెట్టి పద్మావతి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలో గోటివాడ పంచాయతీలో గల నేరేడువలసలో ఎస్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మహిళలనుద్దేశించి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, రాజకీయంలో కూడా పురుషులతో పాటు మహిళలు సగ భాగంలో ఉన్నారని అన్నారు. మహిళలు అభివృద్ధి చెందితే కుటుంబం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ టి.తట్టమ్మ, జడ్పిటిసి జి.సుజాత, ఎస్‌ సొసైటీ కార్యదర్శి షేక్‌గౌస్‌, సొసైటీ సభ్యులు వి.లక్ష్మి, నిర్మల, మహిళ ప్రతినిధులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.

వైసిపి తోనే మహిళలకు ప్రాధాన్యత

ఎమ్మెల్యేపార్వతీపురంటౌన్‌ : వైసిపి ప్రభుత్వం మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించిందని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే సారధ్యంలో వైసిపి మహిళా ప్రజా ప్రతినిధులు, పట్టణ మహిళలు, వాలంటీర్లు, గృహసారథులతో కలిసి మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్‌ చైర్పర్సన్‌, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మనంతా కలిసి నిర్వహించుకోవడం సంతోషదాయకమన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు డాక్టర్‌ యాళ్ల పద్మజ, దిశా సెల్‌ మహిళ హెడ్‌ కానిస్టేబుల్‌ లావణ్య, గంట శైలజ తదితరులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బోను గౌరీస్వరి, వైస్‌ చైర్పర్సన్‌ కొండపల్లి రుక్మిణి, ఇండుపూరు గున్నేశ్వరరావు, పార్టీ పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ మంత్రి రవికుమార్‌, మహిళా కౌన్సిలర్లు, గహ సారదలు, వాలంటీర్లు, పట్టణ మహిళలు పాల్గొన్నారు.

టిడిపి హయాంలో మహిళలకు సంపూర్ణ రక్షణ

పార్వతీపురంరూరల్‌ : టిడిపి హయాంలోనే రాష్ట్రంలో మహిళల హక్కులకు సంపూర్ణ రక్షణ కలిగిందనిటిడిపి పార్వతీపురంనియోజకవర్గ ఇన్చార్జి బోనెల విజరు చంద్ర అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను తన పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మహిళలకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. విజయ చంద్ర మాట్లాడుతూ టిడిపి మహిళలకు గౌరవిస్తుందని, వీరికి అండగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయేనన్నారు. కార్యక్రమంలో టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సీతానగరం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంఇఒ జి.సూరిదేముడును పార్వతీపురానికి చెందిన లయన్స్‌ క్లబ్‌ వారు ఘనంగా సన్మానించారు. విద్యపరంగా ఆమె అందించిన విశిష్ట సేవలకు గాను ఈ సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్‌ అధ్యక్షులు దొడ్డి మోహన్‌, డాక్టర్‌ యాళ్ల వివేక్‌, డాక్టర్‌ ప్రతిభాదేవి, డాక్టర్‌ పద్మజ, డాక్టర్‌ వాగ్దేవి, సీనియర్‌ అడ్వకేట్‌ జోగారావు, చీఫ్‌ జస్టిస్‌ దామోదర్‌ పాల్గొన్నారు.మహిళా దినోత్సవ ప్రత్యేక నేత్ర వైద్య శిబిరం కురుపాం : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకొని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కంటి వెలుగు సెల్‌ నేత్ర వైద్యాధికారి డాక్టర్‌ నగేష్‌ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం మహిళలకు ప్రత్యేక నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేసి 40మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు. వీరిలో 16 మందికి దృష్టి దోషం ఉన్న వారికి ఉచితంగా కళ్ల జోళ్లు, 15 మంది అంతర కుసుమం (కాట్రాక్ట్‌ ) లోపం ఉన్న వారికి శస్త్ర చికిత్సలు కోసం పుష్పగిరి కంటి ఆసుపత్రికి తరలించమని తెలిపారు. కార్యక్రమంలో ఆరోగ్య మిత్ర రజని, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. 

➡️