మహిళా చిరువ్యాపారికి కౌన్సిలర్‌ వేధింపులు

ప్రజాశక్తి-తెనాలి : చిరువ్యాపారిపై అధికార పార్టీ కౌన్సిలర్‌ వేధింపుల పర్వం కొనసాగడం, రోడ్డు వెంట తోపుడు బండిపై టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న కుటుంబంపై సాగుతున్న వేధింపులకు అధికారులు వంత పాడటంతో ఆ కుటుంబం రోడ్డుపై నిరసనకు దిగింది. ఒక దశలో బాధిత మహిళ ముంటల్లో దూకే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. శివాజిచౌక్‌ కూడలిలో చిరువ్యాపారి నాదెండ్ల లక్ష్మిసుజాత కుటుంబం ఆక్రందనపై ఆమె వివరాల ప్రకారం…మండలంలోని కోపల్లెకు చెందిన నాదెండ్ల లక్ష్మీసుజాత కుటుంబం దాదాపు 15 ఏళ్ల క్రితం తెనాలి పట్టణానికి వచ్చింది. శివాజి చౌక్‌ కూడలిలో భర్త, కుమారుడితో కలిసి తోపుడుబండిపై టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. వీరి సంపాదనే అధికార పార్టీ నాయకులకు కన్ను కుట్టిందో ఏమో కాని ఆమె టిఫిన్‌ బండిని అక్కడి నుంచి తీసేయాలని అధికార పార్టీకి చెందిన 5వ వార్డు కౌన్సిలర్‌ తోట రఘురాం హుకుం జారీ చేశారు. అక్కడే 20 అడుగుల దూరంలోకి వారి వ్యాపారం మార్చుకోవాల్సిందిగా చెప్పారు. దీనికి అంగీకరించిన లకీëసుజాత తన బండిని కొంచెం పక్కకు మార్చుకున్నారు. రెండ్రోజులు గడిచిందో లేదో..అక్కడి నుంచి కూడా తోపుడు బండిని తీసేయాలని కౌన్సిలర్‌ పట్టుబట్టారు. ఇదే పాయింట్‌లో నిలిపి ఉంచే బుర్రిపాలెం సర్వీస్‌ ఆటోలను అడ్డం పెట్టించి వ్యాపారారినికి విఘాతం కలిగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విషయం మాజీ కౌన్సిలర్‌ టి.రమేష్‌కు వెల్లడించేందుకు ఆమె కుమారుడు వెళితే.. చెప్పేది వినకపోగా దూషించి పంపించి వేశారని ఆరోపించారు. అది చాలదన్నట్లు మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేయటంతో వారు వచ్చి తోపుడు బండిని ఆమాంతం తీసుకెళ్లిపోయారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులతో పాటు అధికారులూ వేధిస్తున్నారని, విధిలేని పరిస్థితిలో భర్త, కుమారిడితో కలిసి శివాజిచౌక్‌లో కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. ఈలోగా పట్టణ టూటౌన్‌ ఎస్‌ఐ రమేష్‌బాబు, సిబ్బంది అక్కడికి చేరుకుని, సర్ది చెప్పే ప్రయత్నం చేయటంతో ఒక్కసారిగా రోడ్డుపై పెట్రోల్‌పోసి, నిప్పటించిన ఆమె దానిలో దూకే ప్రయత్నం చేశారు. ఆకస్మిక పరిణామంతో ఉలిక్కిపడిన పోలీసులు అప్రమత్తమై, ఆమెను అడ్డుకున్నారు. బాధితులను స్టేషన్‌కు తరలించారు. ఘటనపై వివరణ కోరేందుకు ఎస్‌ఐ రమేష్‌బాబును సంప్రదించగా వారిని అడ్డుకుని స్టేషన్‌కు తరలించామన్నారు. కేసు నమోదుపై సిఐ వివరిస్తారన్నారు. సిఐ వెంకటరావు వివరణ కోరేందుకు ఫోన్‌లో సంప్రదించగా ఆయన స్పందించలేదు.

➡️