మహిళా పక్షపాతి ప్రభుత్వం : ఎమ్మెల్యే

Feb 2,2024 21:09

ప్రజాశక్తి – సీతంపేట : ప్రస్తుత వైసిపి ప్రభుత్వం మహిళా పక్షపాతని స్థానిక ఎమ్మెల్యే వి.కళావతి అన్నారు. స్థానిక ఐటిడిఎ క్రీడా ప్రాంగణం ఆవరణలో వైఎస్సార్‌ ఆసరా వారోత్సవాల్లో భాగంగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. మండలానికి సంబంధించి వైయస్సార్‌ ఆసరా నాలుగో విడతలో 925 స్వయం సహాయక సంఘాల్లో గల 10,503 మంది సభ్యులకు రూ.5.33 కోట్లు వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఈ నాలుగు విడతలు కలిపి సీతంపేట మండలానికి రూ.21.32కోట్లు మహిళల ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపారు. అనంతరం సిఎం వైఎస్‌ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో నిలదొక్కుకోవడంతో పాటు, ఆర్థిక స్వావలంబన దిశగా వారిని ముందుకు తీసుకుని వెళ్తున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో మరోమారు జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకొనేందుకు అక్కచెల్లెమ్మలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని మహిళలను మోసం చేసిన సిగ్గులేని వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎంపిపి బి.ఆదినారాయణ, వైస్‌ఎంపిపి కె.సరస్వతి, జెడ్‌పిటిసి సభ్యులు లక్ష్మి, జెఎస్‌ కో-ఆర్డినేటర్‌ లక్ష్మి, ఎఎంసి చైర్మన్‌ మోహన్‌రావు, ఆర్డినేటర్‌, పలువురు సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, వైసిపి నాయకులు, ఎంపిడిఒ గీతాంజలి, ఎపిడి రమణ, ఇఒపిఆర్‌డి సత్యం, ఎటిఎం విజయకుమారి, సూరమ్మ, తదితరులు పాల్గొన్నారు. పాలకొండ: స్థానిక నగర పంచాయతీకి సంబంధించి నాలుగో విడతలో భాగంగా వైఎస్సార్‌ ఆసరా పథకం 563 స్వయం శక్తి సంఘాల ఖాతాల్లోకి రూ.4.46కోట్లు జమైనట్టు ప్రభుత్వ విప్‌ పి.విక్రాంత్‌ అన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం మహిళలకు పెద్దపేట వేసిందన్నారు. పాదయాత్రలో స్వయం శక్తి సంఘాల మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మాట తప్పకుండా రుణమాఫీ చేశారన్నారు. అదే అభిమానంతో మళ్లీ సిఎంగా జగన్మోహన్‌రెడ్డిని ఎన్నిక చేసుకోడానికి అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్స్‌ పాల్గొన్నారు.

➡️