మాత,శిశు ఆరోగ్య శ్రేయస్సుకు కృషి

Jan 31,2024 21:18

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : మాతా,శిశు ఆరోగ్య శ్రేయస్సుకు వైద్య సిబ్బంది కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి.జగన్నాథరావు సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయంలో ఆశా నోడల్‌ అధికారులకు బుధవారం నిర్వహించిన సమావేశంలో డాక్టర్‌ జగన్నాథరావు పలు ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష చేశారు. గర్భిణీల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాలు, వైద్య సేవలను పక్కగా నిర్వహించాలన్నారు. హై రిస్క్‌ గర్భిణీలను త్వరగా గుర్తించాలంటే గర్భిణీల నమోదు త్వరితగతిన జరగాలని, వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి నెలా నిర్వహిస్తున్న పిఎంఎస్‌ఎంఎ కార్యక్రమం ద్వారా గర్భిణీ లకు పూర్తి స్థాయిలో ఆరోగ్య తనిఖీలు చేపట్టాలన్నారు. టిడి వ్యాక్సిన్‌ రెండు డోసులు నెల వ్యవధిలో వేయించాలని, ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌, కాల్షియం మాత్రలు ప్రతీ రోజూ వేయించాలన్నారు. రక్త హీనతగా గుర్తించిన గర్భిణీలకు ఆసుపత్రిలో చికిత్స కొరకు తల్లి-బిడ్డ ఎక్స్ప్రెస్‌ వాహనం వినియోగించాలన్నారు. ఐదేళ్ల లోపు పిల్లలందరికీ షెడ్యూల్‌ ప్రకారం టీకాలు వేయాలన్నారు. గర్భిణీ, శిశు ఆరోగ్య విషయంలో అలసత్వం వహిస్తే తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పర్యవేక్షణలో అలసత్వం వహించిన నలుగురు సూపర్‌ వైజర్స్‌ కు మెమోలు జారీ చేశారు. కార్యక్రమంలో డిఐఒ నారాయణరావు, డిపిహెచ్‌ఎన్‌ఓ ఉషారాణి, సన్యాసిరావు, విజయలక్ష్మి, జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️