మామిడి తోటమామిడి పూత ఆలస్యం..

Jan 17,2024 20:01
మామిడి తోట

మామిడి తోటమామిడి పూత ఆలస్యం..
ప్రజాశక్తి-ఉలవపాడు
ఉలవపాడు పరిధిలోని మామిడి తోటల్లో పూత ఆలస్యంగా పూస్తోంది. ఈ ఏడాది మామిడి పూతలు ముందే పూస్తున్నాయని రైతులు అనుకునేసరికి రైతుల ఆశలు అడియాసలయ్యాయి. తుఫాను, భారీ వర్షాలు, వాతావరణం మార్పుల వల్ల ముందే పూసిన పూత కాస్త మాడిపోయింది. సాధారణంగా అక్టోబర్‌ నెలలో మామిడి పూతల సీజన్‌ ప్రారంభమవుతుంది. డిసెంబర్‌ నాటికి తోటల్లో పూత పిందె దశలో కనపడాలి. ఈ ఏడాది జనవరి నెల సగానికి పైగా పూర్తయినా తోటల్లో పూతలు కనపడటంలేదు. దీనికి వాతావరణంలో వచ్చిన మార్పులే కారణమని రైతులు చెబుతున్నారు. ఫలితంగా తోటల్లో చెట్లు మొండిగాదర్శన మిస్తున్నాయి. వాతావరణంలో ప్రతికూల కారణంగా ఈ సీజన్లో మామిడి తోటలకు ఇప్పటికీ పూత లేదు. చల్లని వాతావరణం మంచు కురుస్తుండడంతో తోటల్లో పూత వచ్చే అవకాశాలు కనబడటం లేదు. డిసెంబర్‌ లోనే పిందెలు పట్టాల్సిన తోటలు ఇంకా పూతకు రాకపోవడంతో కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. ముం దుగా కొనుగోలు చేసిన మామిడి కౌలు రైతులు రకరకాల మందులతో పిచికారి చేస్తూ భగీరథ యత్నం చేస్తున్నారు. గత ఏడాది ఇదే రోజుల్లో మామిడి తోటల్లో రైతులు పోటీపడి నాలుగు, ఐదు, ఆరు దపాలుగా మందులు పిచికారి చేశారు. ప్రస్తుతం అదే బాటలో మందులు పిచికారి చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ పూతలు ప్రారంభమైనట్లు రైతులు పేర్కొన్నారు.ఏది ఏమైనా ఏడాది మామిడి తోటల పరిస్థితి ఆశాజనంగాఉండే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు.

➡️