మార్కెట్‌లో భారీగా మంటలు

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నరసరావుపేట – చిలకలూరిపేట మార్గంలో గుంటూరు – కర్నూలు జాతీయ రహదారి ప్రక్కనున్న చరిష్మ సూపర్‌ మార్కెట్‌లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున 2.30 గంటలప్పుడు దుకాణంలో చిన్నగా మంటలు రావడంతో వాచ్‌మెన్‌లు గమనించి యజమాని నాగేశ్వరరావుకు సమాచారం ఇచ్చారు. అనంతరం మంటలు వేగంగా విస్తరించడం మొదలైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రెండు ఫైర్‌ ఇంజన్లతో మంటలను ఉదయం 8 గంటల వరకు అదుపు చేస్తూనే ఉన్నారు. వంట నూనె, తదితర నిల్వలకు మంటలు అలుముకోవడంతో అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి సవాలుగా మారింది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో సత్తెనపల్లి, పిడుగురాళ్ల, ఫిరంగిపురం, నరసరావుపేట తదితర ప్రాంతాల్లో స్టోర్లు ఏర్పాటు చేసి సరుకులను సరఫరా చేస్తున్నారు. కోట సెంటర్‌లో ఉన్న స్టోర్‌ను, చిలకలూరిపేట రోడ్‌లో ఉన్న స్టోర్‌ కొద్ది నెలల క్రితమే ప్రారంభించారు. ఇక్కడి నుంచే అన్ని ప్రాంతాలకు సరుకులు సరఫరా చేస్తుంటారు. మంటలను చూసిన యజమాని నాగేశ్వరరావు బోరున విలపించారు. రూ.3 కోట్ల వరకూ నష్టం వాటిల్లిందని వాపోయారు. ప్రమాద స్థలికి అతి సమీపంలో 2 పెట్రోల్‌ బంకులున్న దృష్ట్యా ఎగిసి పడుతున్న మంటలు వలన పెద్ద ప్రమాదం, ప్రాణ నష్టం వాటిల్లిదేనని, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడం పట్ల సిబ్బందికి స్థానికులు అభినందనలు తెలిపారు.

➡️