మాసికలతో మమ..!లక్ష్మీపురం రోడ్డు పనులు శిలాఫలకం

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్నా గుంటూరులో అభివృద్ధి పనులు వేగం పుంజుకోవడం లేదు. గత ఐదేళ్లలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులేమీ చేపట్టలేదు. రూ.168 కోట్ల అంచనాలతో రూపొందించిన కూరగాయల మార్కెట్‌ స్థలంలో బహుళంతస్తుల సముదాయం నిర్మించాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. గతేడాది సెప్టెంబరు 11న సిఎం జగన్‌ గుంటూరులో ఇచ్చిన పలు హామీలకు డిపిఆర్‌లే తయారు కాలేదు. శంకర్‌విలాస్‌ వద్ద ఆర్వోబీ విస్తరణ, పొడిగింపు, నగరంలో నిలిచిపోయిన భూగర్భ డ్రెయినేజి పనుల పునరుద్ధరణ, శ్యామలానగర్‌, సంజీవనగర్‌ ఆర్‌యూబి తదితర పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇప్పటికే నగర పాలక సంస్థ అధికారులకు, ఇతర ముఖ్య నాయకులకు మధ్య నెలకొన్న అంతరాల వల్ల గుంటూరులో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. మరోవైపు ఎన్నికల షెడ్యూలు నిర్ణీత గడువు కంటే ముందే వచ్చే అవకాశం ఉందని ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించడంతో ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తే నిధులు పూర్తిగా నిలిచిపోతాయన్న భయంతో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు వెనుకంజ వేస్తున్నారు. అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుల్లో జాప్యంపై ఈనెల 11న జరిగిన నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశంలో కమిషనర్‌కు, మేయర్‌కు మధ్య స్వల్ప వాగ్వాదమూ తలెత్తింది. నిధులు విడుదలలో నెలకొన్న సమస్యలపై అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు కౌన్సిల్‌ సమావేశంలో కమిషనర్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు ఎలా విడుదల చేయాలనే అంశంపై మేయర్‌, ఇతర ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటే తాను ఈ నిర్ణయం అమలు చేస్తానని కమిషనర్‌ స్పష్టం చేశారు. ఇంత వరకు మేయర్‌ ఎటువంటి సమావేశం ఏర్పాటు చేయలేదు. నిధుల విడుదలపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించలేదు. నిధుల విడుదలలో నెలకొన్న లోపాల వల్ల నగరంలోని అన్ని వార్డుల్లో రూ.100 కోట్ల మేరకు పనులు నిలిచిపోయాయి. తన నియోజకవర్గంలో రూ.40 కోట్ల పనులు ఆగిపోయినట్టు ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌ తెలిపారు. గుంటూరు తూర్పులో మరో రూ.40 కోట్లు, ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని డివిజన్లలో దాదాపు రూ.20 కోట్ల వరకు పనులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం పనులు పూర్తయి బిల్లులు ప్రభుత్వానికి పంపిన కాంట్రాక్టర్లకు ఇంత వరకు క్లియర్‌ అవ్వలేదు. రూ.50 లక్షలు దాటితే సిఎఫ్‌ఎంస్‌ ద్వారా ప్రభుత్వానికి పంపుతున్నారు. రూ.50 లక్షల లోపు అయితే నేరుగా కార్పొరేషన్‌ నుంచి చెక్కులు ఇస్తున్నారు. రాజకీయ నేతల అండదండలు ఉన్న వారికి బిల్లులకు ముందే చెక్కులు రాయాలని కొంత మంది కమిషనర్‌పై వత్తిడి తెస్తున్నారు. మొత్తంగా దాదాపు రూ.40 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. బిల్లులు రాకపోవడం వల్ల వార్డుల్లో పనులు జరగడం లేదని పలువురు కార్పొరేటర్లు చెప్పారు. రూ.50 లక్షలు దాటిన బిల్లులు సిఎఫ్‌ఎంఎస్‌కు పంపడానికి కాంట్రాక్టర్లు అంగీకరించడం లేదు. దీంతో కొన్ని పనులను ముక్కలు చేసి టెండర్లు పిలిచినా కమిషనర్‌ బిల్లులు ఇవ్వడం లేదని అధికార పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2018-19లో చేపట్టిన పనులకు సంబంధించి అప్పటి టిడిపి ప్రభుత్వం ఎన్నికల ముందు దాఖలు చేసిన బిల్లులను పెండింగ్‌లో పెట్టింది. 2019 ఎన్నికల తరువాత ప్రభుత్వం మారడంతో బిల్లులు క్లియర్‌ కావడానికి దాదాపు రెండేళ్లు వేచిచూడాల్సి వచ్చింది.ఇప్పుడుకూడా ఎన్నికల ముందు పనులు చేసి ప్రభుత్వం నుంచి వచ్చే రెండు నెలల్లో బిల్లులు రాకపోతే కోడ్‌ వచ్చిన తరువాత చేసేది ఏమీలేదని మళ్లీ ఎంతకాలం వేచి ఉండాలో తెలియదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. అందువల్ల రానున్న రెండునెలల్లో పనులు పూర్తి చేసినా బిల్లులు వస్తాయో రావోననే అనుమానంతో చాలామంది కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ముందుకు రావడంలేదు. దీంతో నగరపాలక సంస్థల్లోని వివిధ మార్గాల్లో తాత్కాలికంగా ప్యాచ్‌ వర్కులు చేసి సరిపెడుతున్నారు.

➡️