మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వద్దు : కలెక్టర్‌

 ప్రజాశక్తి-రాజవొమ్మంగి(అల్లూరి) : 10వ తరగతి పరీక్షలను సిబ్బంది పకడ్భందీగా నిర్వహించాలని, ఎటువంటి మాస్‌ కాపీయింగ్‌కు ఆశ్కారం కల్పించ వద్దని జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని రాజవొమ్మంగి, జడ్డంగి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ విజయ సునీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ప్రశాంత వాతావరణం కల్పించాలని, ఎటువంటి అసౌకర్యం కలగనీయరాదని, పరీక్షా కేంద్రాల్లో విద్యుత్‌, తాగునీరు, ఫర్నిచర్‌, వైద్య సదుపాయం అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అత్యవసర వైద్య శిభిరాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పాఠశాల పరిసరాలలో 144 సెక్షన్‌ పక్కాగా అమలు చేయాలని ఇతరులను లోపాలకి అనుమతించరాదని ఆదేశించారు. విద్యార్థులందరూ పరీక్షలు బాగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాహశీల్దార్‌ సత్యనారాయణ, సీఐ సన్యాసినాయుడు, ఎస్‌ వెంకయ్య, సిబ్బంది తదితరులు ఉన్నారు.

➡️