మా ఆవేదనను పట్టించుకోండి..

పల్నాడు కలెక్టరేట్‌ ధర్నా చేస్తున్న విఆర్‌ఎలు
ప్రజాశక్తి పల్నాడు జిల్లా :
రెవెన్యూ విభాగంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగి ఉండి, వారి భూమి సమస్యల పరిష్కారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న తమ ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవాలని గ్రామ రెవెన్యూ సహాయకు (విఆర్‌ఎ)లు కోరారు. కనీస వేతనాలు అమలు, ఇతర అంశాలపై గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో నరసరావుపేటలోని కలెక్టర్‌ వద్ద గురువారం ధర్నా చేసి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.అనంతరాజు అధ్యక్షత వహించారు. జిల్లా గౌరవ అధ్యక్షులు జి.మల్లేశ్వరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మాదిరి వీఆర్‌ఏలకు పే స్కేల్‌ వర్తింపచేయాలని, ఖాళీగా ఉన్న విఆర్‌ఓ పోస్టుల్లో అర్హులైన వీఆర్‌ఏలకు ప్రమోషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రూ 26 వేలు వేతనాలు ఇవ్వాలని, ప్రభుత్వం ప్రకటించిన రూ.500 డిఎ, 2018 నుండి వేతనంతో కూడిన డిఏ గా తక్షణమే కొనసాగించాలని, రికవరీ చేసిన అమౌంట్‌ని వీఆర్వోలు ఖాతాలకు జమ చేయాలని కోరారు. విఆర్‌ఎలకు ఇప్పుడిస్తున్న రూ.10 వేలతో కుటుంబ పోషణ ఎలా అని ప్రశ్నించారు. 2017 మార్చి 24న ప్రతిపక్ష నేత హోదాలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వీఆర్‌ఏల సమ్మె శిబిరం వద్దకు వచ్చి అధికారంలోకి రాగానే వీఆర్‌ఏల సమస్యలు పరిశీలిస్తామని హామీ ఇచ్చినా ఒక్క సమస్యనూ పరిక్షరించలేదని మండిపడ్డారు. సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు షేక్‌ బందగీ సాహెబ్‌ మాట్లాడుతూ నామినీలుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్‌ చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా వర్తింపచేయాలని, రీసర్వే లో వీఆర్‌ఏలు సొంత గ్రామంలోనే పని చేయించాలని డిమాండ్‌ చేశారు. అదనపు పనులు చేయిస్తూ సర్వీసు రూల్స్‌ వ్యతిరేకంగా విధులు చేయించడం శ్రమ దోపిడీ చేయడం నైట్‌ వాచ్మెన్‌ అటెండర్‌ పోస్టులు చేయించడం మానుకోవాలన్నారు. తమ సమస్యలను పరిష్కరించే వరకూ పోరా టాలు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. ధర్నాలో నాయకులు ఎస్‌.వెంకటేశ్వరరాజు, సంజీవరావు, సుబ్బారావు, పౌలేసు, వెంకటరత్నం, ఆనంద్‌ పాల్గొన్నారు.

➡️