మా చెవిలో మళ్లీ పూలు పెట్టొద్దు..!

ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక దీక్ష గురువారంతో 10వ రోజుకు చెరుకుంది. రోజురోజుకూ సమ్మె ఉధృతం అవుతుంది. గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన సమ్మె శిబిరానికి అంగన్‌వాడీలు పెద్ద సంఖ్యలో వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కార్యాలయం గేటు ఎదుట మానవ హారం ఏర్పాటు చేసి నిరసన తెలియజేశారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ధర్నా చౌక్‌ వద్ద సమ్మె శిబిరం కొనసాగుతుంగా చెవిలో పూలతో అంగన్వాడీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు సమ్మె శిబిరంలో సిఐటియు నగర పశ్చిమ ప్రధాన కార్యదర్శి బి.ముత్యాలరావు మాట్లాడుతూ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి అంగన్‌వాడీల సమ్మె పట్ల అనుచితంగా మాట్లాడటం తగదన్నారు. అంగన్‌వాడీలు టీచర్లు కాదని, కార్యకర్తలని, కాన్వెంట్‌ టీచర్ల కంటే ఎక్కువ వేతనం ఇస్తున్నామని చెప్పటం సరికాదన్నారు. అంగన్‌వాడీలు పిల్లలకు చదువు చెప్పటంతోపాటు, వారి ఆలనా పాలనా చూడటం, గర్భిణులు, బాలింతలకు ఆహారం అందించటం వంటి రకరకాల సేవలు అందిస్తున్నారన్నారు. ప్రభుత్వం బిల్లులు సకాలంలో చెల్లించకపోయినా ఎదురు పెట్టుబడులు పెట్టి సెంటర్లు నడుతుపున్నారని గుర్తించాన్నారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నగర ప్రధాన కార్యదర్శి టి.రాధ అధ్యక్షతన జరిగిన సమ్మె శిబిరంలో బహుజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జె.యోహాన్‌, జనతాదళ్‌ నాయకులు ఎన్‌.సాంబశివరావు, శ్రామిక జన సమాఖ్య విల్సన్‌ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ ఐక్యంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు చినవెంకాయమ్మ, నాయకులు శ్యామలా, వేదవతి, గోళ్ల మెర్సి, బాజీబి, పద్మ పాల్గొన్నారు.

నరసరావుపేట సమ్మె శిబిరం నిరసనకు ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) సంఘీభావం తెలిపింది. యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు సిలార్‌ మసూద్‌ మాట్లాడారు. అంగన్వాడీ సెంటర్‌ల నిర్వహణ తమ వల్ల కాదంటున్నా సచివాలయ, గ్రామ రెవిన్యూ, వాలంటీర్‌ ఇతర సిబ్బంది ని ప్రభుత్వం బెదిరింపులకు గురిచేసి సెంటర్‌ తాళాలు తీసి తెరిపిస్తున్నారని మండిపడ్డారు. బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన జీవో అంగన్వాడిలను మరింత ఆగ్రహావేశాలకు గురి చేసేలా ఉందన్నారు. నెలకు 2 సమావేశాలకు ఇచ్చే టిఏ, డిఏ లు తాజాగా జీవోలో కార్యకర్త సహాయకురాలకు ఒక సమావేశానికే ఇవ్వనున్నట్లు పేర్కొందన్నారు. 2017 నుంచి ఇవ్వాల్సిన టి.ఏ, డి.ఏలపై హామీ ఇవ్వలేదని మండిపడ్డారు. యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అమరారపు సాల్మన్‌ మాట్లాడుతూ అంగన్వాడీలకు ఇస్తున్న గౌరవ వేతనంతో కుటుంబాలు ఎలా పోషించుకోవాలని, పెరుగుతున్న ధరలకు తగినట్టుగా మెనూ ఛార్జీలు పెంచకుండా గర్భిణీలకు బాలింతలకు చిన్నారులకు పోషకాహారం ఎలా ఇవ్వాలని ప్రశ్నించారు. అంగన్వాడిలను భయపెట్టడానికి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా అంగన్వాడీల సమ్మెను కొనసాగించాలని, వారికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. తామూ పూర్తి మద్దతుగా నిలుస్తామన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు నిర్మల, కవిత, ప్రసన్న, ఎఐటియుసి నాయకులు హెల్డా ప్లాన్స్‌, శోభారాణి, విజయలక్ష్మి, విజరు కుమార్‌ పాల్గొన్నారు.

➡️