మిచౌంగ్‌ నష్టపరిహారం కోసం వినతులు

తాడేపల్లి మండలంలో వినతిపత్రం ఇస్తున్న రైతు సంఘం నాయకులు
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా విలేకర్లు : ఇటీవల మిచౌంగ్‌ తుపాను వల్ల పంటలు నష్టపోయిన రైతులు, కౌలురైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతు, కౌలురైతు సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు పలుచోట్ల రైతు భరోసా కేంద్రాల్లో అధికారులకు గురువారం వినతిపత్రాలు ఇచ్చారు. దుగ్గిరాల, తాడేపల్లి రూరల్‌ కుంచనపల్లి, పాతూరు, గుండిమెడ, చిర్రావూరు, మెల్లెంపూడి, వడ్డేశ్వరం ఇప్పటం, కొలనుకొండ గ్రామాల్లోని రైతుభరోసా కేంద్రాల్లో, తెనాలి మండలం గుడివాడ సచివాలయంలో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం తాడేపల్లి మండల వ్యవసాయ అధికారి ఎ.శ్రీనివాసులుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రైతుసంఘం జిల్లా అధ్యక్షులు జె.శివశంకరరావు, ఉపాధ్యక్షులు ఎం.శివసాంబిరెడ్డి మాట్లాడుతూ చేతికొచ్చిన వరి ధాన్యం, అరటి, కంద, మినుము, ఆకుకూరలు వంటి పంటలు నీట మునిగి, రైతులు, కౌలు రైతులు పూర్తిగా నష్టపోయారని అన్నారు. అధిక వర్షాల వలన పంటలు నీట మునగడానికి ప్రధాన కారణం పంట పొలాలలో డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడమేనని విమర్శించారు. బాధిత రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సత్వరమే పంట నష్టం అంచనా వేసి, రైతులకు నష్టపరిహారం అందించాలన్నారు. ఎకరానికి రూ.25 వేలు, వాణిజ్య పంటలకు రూ.50 వేలు నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ-క్రాప్‌, సిసిఆర్‌సి కార్డుతో సంబంధం లేకుండా, కౌలు రైతులకే నేరుగా పరిహారం అందించాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి ఉచితంగా విత్తనాలు అందించాలని, పాత పంట రుణాలు రద్దుచేసి, కొత్తగా రుణాలు రైతులకు ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పనులను కోల్పోయిన వ్యవసాయ కార్మికులకు, ఉపాధి కార్మికులకు అదనంగా 50 రోజులు పని దినాలు కల్పించి ఆదుకోవాలని కోరారు. డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరిచి, పంటలు ముంపుకు గురికాకుండా, శాశ్వత చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనలను సడలించి, అన్ని పంటలను మద్దతు ధరలకే కొనుగోలు చేయాలని, ఉచిత బీమాను అన్ని పంటలకు వర్తించే విధంగా చర్యలు చేపట్టి, రైతు, కౌలు రైతులను , వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు డి.వెంకటరెడ్డి, కె.ఈశ్వరరెడ్డి, ఎస్‌కె ఎర్రపీరు, టి.బక్కిరెడ్డి, పి.వీరాస్వామి, ఎస్‌.కోటేశ్వరరావు, జె.బాలరాజు, ఎన్‌.యోగేశ్వరరావు, బి.అమ్మిరెడ్డి, బిఎస్‌ఎల్‌ రావు, వై.రాఘవులు, బి.సుబ్బారావు, జి.శివశంకర్‌, టి.శ్రీనివాసరావు. కె.గగారిన్‌, కె.కృష్ణారావు, కె.రవి, నాగరాజు, టి.శ్రీహరి పాల్గొన్నారు.

➡️