మిమ్స్‌ కుట్రతో సిఐటియు నాయకుల నిర్భందం.. ఉద్యోగుల అక్రమ అరెస్టులు

Feb 24,2024 19:59

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :  మిమ్స్‌ (మహారాజా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌) ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్న సిఐటియు నాయకులను, ఆ ఉద్యోగులను పోలీసులు నిర్భందించారు. సుమారు. 15మంది నాయకులను, మిమ్స్‌ ఉద్యోగులను నెలిమర్ల, డెంకాడ పోలీస్‌ స్టేషన్లకు అక్రమంగా తరలించి అరెస్టు చేశారు. జనవరి నెల వేతనం ఇవ్వాలని, బకాయి ఉన్న ఏడు డిఎ లు ఇవ్వాలని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ 24రోజులుగా సిఐటియు ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్మికశాఖ అధికారులు చర్చలు ఏర్పాటు చేయకపోవడం, యాజమాన్యానికి కొమ్ము కాయడంతో శనివారం డిసిఎల్‌ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు.

ఈనేపథ్యంలో పోలీసులు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి టివి రమణ, పలువురు మిమ్స్‌ ఉద్యోగుల ఇళ్లను నెల్లిమర్ల, విజయనగరం వన్‌ టౌన్‌ ఎస్‌ఐల ఆధ్వర్యాన శనివారం తెల్లవారుజామున 4గంటలకే చుట్టుముట్టారు. తమ్మినేనిని తొలుత అరెస్టుచేసేందుకు ప్రయత్నించారు. తనుకు ఆరోగ్య బాగోలేదని చెప్పడంతో ఇంటిబయటకు రానీయకుండా అడ్డుకున్నారు. ఉదయం 10గంటల సమయంలో కార్యకర్తలతో జరగాల్సిన అత్యవసర సమావేశంలో పాల్గొనేందుకు తోటపాలెంలోని కార్యాలయానికి బయలు దేరిన ఆయనను మార్గంలో వెంబడించారు. పార్టీ కార్యాలయంలోకి చొరబడిమరీ ఆయనను అరెస్టుచేసి, జీపులో స్టేషన్‌కు తరలించారు. అటు టివి రమణను ఇంటి నుంచి బయటకు రానీయలేదు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌ను అరెస్టు చేసేందుకు తెల్లవారు జాము నుంచీ గస్తీ నిర్వహించారు. మరోవైపు నిరసన కార్యక్రమాల్లో చురుకుగా ఉన్న ఉద్యోగులను కూడా వదల్లేదు. దొరికినవారిని దొరికినట్టు ఇళ్ల వద్ద, బయట అరెస్టులు చేసి డెంకాడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయినప్పటికీ మిగతా ఉద్యోగులంతా డిసిఎల్‌ కార్యాలయం వద్దకు చేరుకొని బైఠాయించారు. అధికారులు స్పందించి తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️