మిమ్స్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

Mar 27,2024 21:20

ప్రజాశక్తి – నెల్లిమర్ల : ఉద్యోగులను, కార్మికులను, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న మిమ్స్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు టివి. రమణ డిమాండ్‌ చేశారు. స్థానిక ఆర్‌ఒబి వద్ద తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న నిరశన పోరాటం బుధవారం నాటికి 56వ రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు 7డిఎలు ఇవ్వలేదని, 2019 నుంచి ఇంత వరకు వేతన ఒప్పందం చేయలేదని కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులను పర్మినెంట్‌ చేయలేదని తెలిపారు. సమస్యలపై అడిగితే సస్పెన్స్‌ లు, బదిలీలు, వేధింపులకు పాల్పడి నియంతృత్వ దోరణి అవలంభిస్తోందని తెలిపారు. గత 56 రోజులుగా ఉద్యోగులు, కార్మికులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని నిరశన తెలపడంతో మిమ్స్‌లో ఎటువంటి సేవలూ అందడం లేదు సరికదా వైద్య విద్యార్థులకు బోధనలు కూడా అందకుండా పోతున్నాయని ఇంత జరుగు తున్నా (ఎన్‌ఎంసి) జాతీయ వైద్య మండలి ఏమి చేస్తుందని ప్రశ్నించారు. ఉద్యోగులు, కార్మికులు వల్ల అభివృద్ధి జరిగిన సంస్థను ఏమీ చేయకూడదని ఓపిక, సహనంతో సమస్యల పరిష్కారానికి ఎదురు చూస్తున్నారని ఒక్కసారి కడుపు మంట రగిలితే ఆ మంటలో యాజమాన్యం మాడి మసైపోతుందని హెచ్చరించారు. ఇప్పటికైన మిమ్స్‌ యాజ మాన్యం, ప్రభుత్వం స్పందించి వారి న్యాయ మైన సమస్యలు పరిష్కరంచాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి మిరప నారాయణ, ఉద్యోగులు కె.మధు, కె. కామునాయుడు, ఎం. నాగ భూషణం, మూర్తి, గౌరి, బి. బంగారునాయుడు, ఎం.రాం బాబు, వరలక్ష్మి, అప్పల నాయుడు పాల్గొన్నారు.

➡️