మిల్లర్ల వద్దకు వెళ్లొద్దు

Dec 15,2023 21:19

ప్రజాశక్తి – పార్వతీపురం   :  రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకొనేందుకు, ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర పొందుటకు రైతుభరోసా కేంద్రాలను సంప్రదించాలని జాయింటు కలెక్టరు ఆర్‌.గోవిందరావు తెలిపారు. జిల్లా వ్యవసాయ, నీటిపారుదల సలహా మండలి సమావేశాలు కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో జెసి మాట్లాడుతూ ఇక్రాప్‌ చేసిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం మిల్లులకు సరఫరా చేస్తున్నామన్నారు. కావున రైతులకు, మిల్లర్లకు మధ్య ఎటువంటి సంబంధం ఉండదని, మొత్తం కస్టోడియన్‌ బాధ్యత వ్యవహరిస్తారని, ఎవరైనా మిల్లర్లు రైతులను సంప్రదించాలని కోరితే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. జిల్లా వ్యవసాయ సలహామండలి అధ్యక్షులు వాకాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో గతేడాది ఎదురైన లోటుపాట్లు అధిగమించి ఏర్పాట్లు చేశామన్నారు. తుపానుకు పాడైన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలులో రైతులకు, మిల్లర్లకు మధ్య ఎటువంటి సంబంధం లేకుండా చూడాలని అన్నారు. అలాగే సాగునీటి కాలువల నిర్వహణ వేసవిలో పంటకాలానికి ముందుగానే చేపట్టాలని ఇరిగేషను అధికారులకు సూచించారు. పాలకొండ ఎమ్మెల్యే వి.కళావతి మాట్లాడుతూ తన నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో రైస్‌ మిల్లులు తక్కువగా ఉన్నాయని, సార్టెక్స్‌ సదుపాయం, బ్యాంకు గ్యారంటీల కారణంగా ధాన్యాన్ని స్థానిక మిల్లులకు తరలించేందుకు వీల్లేకపోతే గోదావరి జిల్లాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అలాగే మత్స్యశాఖకు సంబంధించి సుమారు 12 లక్షల చేపపిల్లలను మత్స్యకార సంఘాల ద్వారా చెరువులలో వదలడం జరుగుతుందని, కానీ వాటినుండి ఆశించిన దిగుబడిరావడం లేదన్నారు. చేపలు ఎదగకముందే చెరువుల్లో నీరు తగ్గిపోతుందని, కావున నీరు నిల్వ చేసేందుకు అవకాశం గల చెరువుల్లో తూముల నిర్మాణం చేపట్టాలని, నీరు నిల్వ ఉండేలా ఉపాధి హామీ పనులు చేపట్టాలని, జూలై, ఆగష్టు మాసాల్లో చేప పిల్లలను పంపిణీ చేయాలని అధికారులకు తెలిపారు. ఈ ప్రాంతంలో సీజనల్‌ వచ్చే ఫైనాపిల్‌, సీతాఫలం పంటలకు ఒక్కొక్కసారి సరైన ధరరాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కావున విభిన్న పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. పట్టు పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహకాలను అందించా లని కోరారు. జిల్లా వ్యవసాయ అధికారి కె రాబర్ట్‌ పాల్‌ మాట్లాడుతూ జిల్లాలో తుపాను కారణంగా రూ.56 లక్షల పంటనష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా వేశామన్నారు. పూర్తి నష్టం వివరాలకు కమిటీ వేశామని, ఈ కమిటీ ఈనెల 18 నాటికి నివేదిక అందజేస్తుందని, సచివాలయం స్థాయిలో సోషల్‌ ఆడిట్‌ అనంతరం ఈనెల 26న తుది నివేదిక అందజేస్తామనితెలిపారు. పంట నష్టాన్ని రైతులకు సంక్రాంతి ముందుగానే అందజేస్తామన్నారు. మండల స్థాయిలో వ్యవసాయ సలహా మండలి సమావేశాలలో టార్పాలిన్లు సరఫరా, వ్యక్తిగతంగా రాయితీపై వ్యవసాయ పరికరాలు మంజూరు, కాలువలలో పూడికతీత తీయాలని, రంగుమారినధాన్యం సేకరణ మొదలైన అంశాలపై తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహంలో భాగంగా జిల్లాలో 8వేల హెక్టార్లులో అపరాలు సాగుకు విత్తనాలు రాయితీపై పంపిణీ చేసినట్టు తెలిపారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ ఎం.డి.నాయక్‌ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు సంబంధించిన మిల్లులకే పంటను పంపిస్తున్నామన్నారు. సంచులు ఆర్‌బికెలకు సరఫరా చేశామన్నారు. జిల్లా జలవనరుల శాఖ ఎస్‌ఇ వై.వి.రాజరాజేశ్వరి మాట్లాడుతూ జిల్లాలో ప్రాజెక్టులు ఖరీఫ్‌ పంటకు సాగునీరందించేందుకేనని, రబీ సాగుకు ప్రణాళిక లేదని తెలిపారు. ప్రాజెక్టుల పనులకు ప్రతిపాదనలు సిద్దంచేసినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా ఉద్యాన అధికారి కె.ఎస్‌. వరప్రసాద్‌, జిల్లా సహకార అధికారి బి. సన్యాసి నాయుడు, జిల్లా మత్స్య శాఖ అధికారి వి.తిరుపతయ్య, ఇతర అధికారులు, సభ్యులు పాల్గొన్నారు.

➡️