ముందస్తు చర్యలతో నేరాలు తగ్గుముఖం : ఎస్‌పి

Dec 29,2023 20:22

ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌  :  ముందస్తుగా పటిష్ట చర్యలతో పోక్సో, రేప్‌ నేరాలు తగ్గుముఖం పట్టాయని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ ఏడాది వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కన్విక్షన్‌ బేస్డ్‌ పోలీసింగ్‌తో మహిళలపై జరిగే నేరాలు, తీవ్రమైన నేరాలు తగ్గుముఖం పట్టాయని, సారా నిర్మూలనే లక్ష్యంగా స్పెషల్‌ ఎన్ఫోర్స్మెంట్‌ బ్యూరో చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయని తెలిపారు. కన్విక్షన్‌ బేస్డ్‌ పోలీసింగ్‌లో భాగంగా జిల్లాలో 17 తీవ్రమైన నేరాల్లో శిక్షలు ఖరారయ్యాయని చెప్పారు. వీటిలో మహిళలు, బాలికలపై జరిగిన నేరాల్లో 7 కేసుల్లో 20ఏళ్లు, యావజ్జీవ ఖైదు శిక్షలు ఖరారయ్యాయి. ఇదే క్రమంలో హత్యలు, హత్యయత్నం, మహిళలపై దాడులు, కొట్లాటలు, ఎస్‌సి, ఎస్‌టిలపై దాడులు తగ్గాయని తెలిపారు. మహిళలపై జరిగిన అఘాయిత్యాలు ఈ ఏడాది 24 కేసులు నమోదయ్యాయన్నారు. మహిళల గౌరవానికి భంగం కల్గించే కేసులు 58 కేసులు, పోక్సో కేసులు 18, మైనర్‌ బాలికల అపహరణ కేసులు 9 నమోదయ్యా యని తెలిపారు. మహిళలపై జరిగిన నేరాలు ఈ ఏడాది 211 కేసులు,. ఎస్‌సి, ఎస్‌టిలపై దాడులు 35కేసులు, లాభాపేక్ష హత్యలు, దోపిడీలు, హత్యా యత్నాల కేసులు 5, కొట్లాట, హత్యా యత్నం 8, ఇతర కొట్లాట కేసులు 150 నమోదయ్యాయన్నారు.పెరిగిన రోడ్డు ప్రమాదాలుజిల్లాలో గతేడాది కంటే ఈ ఏడాది రోడ్డుప్రమాదాలు, మరణాలు పెరిగాయి. 2022లో 267 రోడ్డు ప్రమాద కేసులు నమోదవ్వగా, 77 మంది మృతి చెందారు. 437 మంది గాయపడగా, 2023లో స్వల్పంగా 3శాతం కేసుల సంఖ్య పెరగ్గా, 275 కేసులు నమోదై 95 మంది మృతి చెంది 389 మంది గాయపడ్డారు. గతేడాది డ్రంక్‌, డ్రైవ్‌ కేసులు 125 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 2781 కేసులు నమోదు చేశామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై 2022లో 1962 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 10,054 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అధిక లోడ్‌తో వెళ్లే వాహనాలపై 2022 901 కేసులు నమోదు కాగా, 2023లో 1643 కేసులు నమోదు చేశామన్నారు. దొంగతనాలకు సంబంధించి గతేడాది రూ.78,46, 100 విలువైన ఆస్తులు చోరీకి గురి కాగా, వాటిలో రూ.37,50,136 విలువైన ఆస్తులు రికవరీ చేశామని, ఈ ఏడాది రూ.50,66,860 విలువైన ఆస్తులు చోరీకి గురి కాగా, వాటిలో 52.21 శాతం కేసులను ఛేదించి 44.18 శాతం అనగా రూ. 22,38,894 విలువైన ఆస్తులు రికవరీ చేసినట్లు తెలిపారు. అలాగే మిస్సింగ్‌ కేసులకు సంబంధించి గతేడాది 127మంది తప్పిపోగా 115 మందిని వెతికి పట్టుకోగా, ఈ ఏడాది 100 మంది తప్పిపోగా 88 మందిని వెతికి పట్టుకొని, వారి తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు సురక్షితంగా అప్పగించామని తెలిపారు.540 నాటుసారా కేసులు నమోదుఈ ఏడాది నాటు సారా వ్యాపారంపై విస్తృతంగా దాడులు చేసి 540 కేసులు నమోదు చేసి, 15,914 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని, 609 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్టు ఎస్‌పి తెలిపారు. గతేడాది 98 కేసులు నమోదు చేసి 498. 61 లీటర్లు మద్యం స్వాధీనం చేసుకోగా, ఈ ఏడాది 121 కేసులు నమోదు పరచి 845.54 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకొని 127 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామని చెప్పారు. ఇక గంజాయి అక్రమ రవాణా దారులపై ఈ ఏడాది ప్రత్యేకంగా చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి 14 కేసులు నమోదు చేసి, 27 మందిని అరెస్ట్‌ చేసి వారి నుంచి 205.64 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి కేసుల్లో కఠిన చర్యలు చేపట్టి, గంజాయి వినియోగిస్తున్న వారిపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని, స్కూళ్లు, కాలేజీల్లో మాదక ద్రవ్యాల నిర్మూలన గురించి పలు అవగా హన సదస్సులు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు.స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోఇదిలా ఉండగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో చేసిన దాడుల్లో నాటు సారా వ్యాపారం చేసే వారిపై ఈ ఏడాది 673 కేసులు నమోదు చేసి 23,679 లీటర్ల నాటు సారా ను స్వాధీనం చేసుకొని 803 మందిని అరెస్టు చేసి రిమాండుకు పంపడంతో పాటు 73 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అక్రమ మద్యానికి సంబంధించి ఈ ఏడాది 205 కేసులు నమోదు చేసి, 418 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకొని 206 మందిని అరెస్టు చేసి రిమాండుకు పంపాం. సైబర్‌ నేరాల సంఖ్య 2022లో 29 కాగా, 2023లో 32 కేసులు నమోదయ్యాయన్నారు. సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి, సైబర్‌ నేరాలు మోసాలు జరిగే తీరు లోన్‌ యాప్‌ల వల్ల కలిగే అనార్ధాలను వివరించామని, నేరం జరిగిన తర్వాత ఫిర్యాదు చేయడం పట్ల అవగాహన కల్పించినట్టు తెలిపారు. అలాగే 1930 టోల్‌ ఫ్రీ నెంబరుకు వెంటనే కాల్‌ చేయడంపై అవగాహన పెంచడం వల్ల కేసుల నమోదు సంఖ్య గత ఏడాది కంటే పెరిగాయన్నారు. కార్యక్రమంలో ఎఎస్‌పి ఒ.దిలీప్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️