‘ముత్తుముల’కు బీసీ నాయకుల సన్మానం

ప్రజాశక్తి-గిద్దలూరు: పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డిని పట్టణ బీసీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి పూలమాల శాలువా వేసి ఘనంగా సన్మానించారు. జయహో బీసీ కార్యక్రమం లో భాగంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్‌పై హర్షం వ్యక్తం చేస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు, జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌కు, గిద్దలూరు టీడీపీ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం అంటే బీసీల పార్టీ అని, బీసీల సంక్షేమం కోసం పాటు పడే పార్టీ అని, బీసీ డిక్లరేషన్‌లో ముఖ్య అంశాలైన తెలుగుదేశం అధికారంలోకి రాగానే 50 ఏళ్ళు నిండిన బీసీలకు రూ.4 వేలు పెన్షన్‌, బీసీ రక్షణ చట్టం, బీసీలకు కుల ధ్రువపత్రాల మంజూరు, బీసీ భవనాలు పూర్తి చేయటం, దామాషా ప్రకారం నిధులు కేటాయింపు, జనాభా ప్రకారం కార్పొరేషన్లు ఏర్పాటు, పెళ్లి కానుక లక్షకు పెంపు వంటి అంశాలు బీసీల అభ్యున్నతికి, సంక్షేమానికి ఎంతగానో లబ్ది చేకూరుస్తాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేనల ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటులో గిద్దలూరు నియోజకవర్గంలో ముత్తుముల అశోక్‌రెడ్డి గెలుపు కోసం బీసీలు ముందుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణంలోని బీసీ నాయకులు, బీసీ సాధికార కమిటీ అధ్యక్షులు, సభ్యులు, పార్లమెంట్‌ బీసీ నాయకులు, బీసీ సర్పంచులు, కౌన్సిలర్లు, బీసీ ప్రజలు పాల్గొన్నారు.

➡️